- సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పిలుపు
ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : రాజ్యాంగ పరిరక్షణకు అందరూ కలిసి కట్టుగా పోరాడాలని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్న పాలకులు కేంద్రంలో ఉన్నారని, వారి విధానాల వల్ల తీవ్ర నష్టం కలుగుతోందని, మున్ముందు ఇది మరింత తీవ్రం కానుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన అవసరముందని తెలిపారు. అందుకోసం సెక్కులర్, ప్రజాస్వామ్య శక్తులు కలిసి పోరాడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కెవిపిఎస్, ప్రజానాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విజ్జాన కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలోని అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని తరగతుల వారు ఉన్నత స్థితికి చేరుకోవడం కోసం దోహదపడే విధంగా అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఓట్లను కొనుగోలు చేయడం అప్పట్లోనూ ఉందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్‌ను ఓడించడం కోసం ప్రత్యర్థులు ఓటుకు రూ.10 చొప్పున ఖర్చు చేశారని చెప్పారు. ఆయన్ని పార్లమెంటులోకి రాకుండా రెండుసార్లు అడ్డుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరొక రాష్ట్రం నుంచి పోటీ చేసి పార్లమెంట్‌లో ప్రవేశించి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. పురుషులతో సమానంగా స్త్రీలకు సమాన హక్కులు కల్పించాలని ఆయన ప్రయత్నించగా నాటి పాలకులు అడ్డుపడ్డారన్నారు. ఈ చర్యతో ఆయన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు. దేశ సంపదను నేడు అదాని, అంబాని, మిట్టల్ వంటి వారికి దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగం పటిష్టంగా ఉంటేనే రాజ్యాంగ రక్షణ సాధ్యమని స్పష్టం చేశారు. ఇది జరగాలంటే కమ్యూనిస్టులు ఐక్యం కావాలని సూచించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం దళితులు, మైనారిటీలు, కవులు, కళాకారులపైనా దాడులు చేస్తోందన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోందని వివరించారు. కార్మిక చట్టాలను మార్చివేసి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటీకరణ చేస్తోందన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకుండా చేసి నిరుద్యోగాన్ని పెంచుతోందని తెలిపారు. మోడీ పాలనతో రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని తెలిపారు. రాజ్యాంగం ఉంటేనే ప్రజలకు రక్షణ ఉంటుందన్నారు. అంబేద్కర్ చెప్పిన విధంగా ప్రజలను సమీకరించడం, బోధించడం, పోరాడటం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సభ ప్రారంభంలో కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి రాజ్యాంగ పీఠిక చదివి అందరితో ప్రమాణం చేయించారు.
ఆకట్టుకున్న ర్యాలీ, కళారూపాలు
రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనంలో భాగంగా తొలుత విశాఖలోని అంబేద్కర్ విగ్రహం నుంచి అల్లూరి విజ్ఞాన కేంద్రం వరకూ ర్యాలీ నిర్వహించారు. దీన్ని ఆర్.నారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. డప్పుల వాయిద్యాలు, మహిళల కోలాటం, తీన్మార్‌తో సాగిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కళారూపాల ప్రదర్శనలు, నాటికలు ఆలోచింపజేశాయి.