ఎపిఎల్‌ లోగో ఆవిష్కరణ

Jun 10,2024 23:51 #aca, #apl
ఎపిఎల్‌ లోగోను ఆవిష్కరిస్తున్న క్రికెటర్లు నితీష్‌ కుమార్‌రెడ్డి, కెఎస్‌.భరత్‌, రికి బురు తదితరులు

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ :

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఎపిఎల్‌) మూడో ఎడిషన్‌కు సంబంధించిన ‘మన ఆంధ్ర – మన ఎపిఎల్‌’ లోగోను విశాఖపట్నానికి చెందిన ఐపిఎల్‌ క్రీడాకారులు నితీష్‌ కుమార్‌ రెడ్డి (సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌), కెఎస్‌.భరత్‌ (కొలకతా నైట్‌రైడర్స్‌, రికి బురు (ఢిల్లీ కేపిటల్స్‌) సోమవారం నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపీనాధ్‌ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌ను 120 మంది క్రీడాకారులతో ఆరు జట్లు, 19 మ్యాచ్‌లుగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మ్యాచ్‌లను జూన్‌ 30వ తేదీ నుంచి జులై 13వ తేదీ వరకు విశాఖపట్నం, కడప నగరాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆంధ్రా క్రీడాకారులు తమ క్రికెట్‌ నైపుణ్యతను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు ఎపిఎల్‌ చక్కని వేదికని తెలిపారు. బెజవాడ టైగర్స్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, గోదావరి టైటాన్స్‌, రాయలసీమ కింగ్స్‌, వైజాగ్‌ వారియర్స్‌, కోస్టల్‌ రైడర్స్‌ జట్టు ఎపిఎల్‌లో తలపడతాయన్నారు. రూ.12 కోట్ల వ్యయంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్టార్‌ స్పోర్ట్స్‌, తెలుగు స్టార్‌ స్పోర్ట్స్‌ ఫస్ట్‌, ఫ్యాన్‌ కోడ్‌లో ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఎపిఎల్‌ పాలక మండలి సభ్యులు మాంకో ఫెర్రర్‌, కోశాధికారి ఎవి.చలం, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు జితేంద్రనాథ్‌ శర్మ, ఎసిఎవి సభ్యులు మురళీమోహన్‌, డి.ఆస్కార్‌ వినోద్‌, ఎసిఎ పిఆర్‌ఒ రాజ్‌ గోపాల్‌ పాల్గొన్నారు.

 

➡️