మే 20 అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలి
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : కార్మికులను బానిసలుగా చేసేటటువంటి లేబర్ కోర్సును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20 న అఖిలభారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. శనివారం జగదాంబ దరి సిఐటియు ఆఫీసులో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, మే 20న అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని వేసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తుందన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్పు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారని అన్నారు. ఈ కోడ్స్ వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, జీతభత్యాలు బేరమాడే హక్కు కోల్పోతారన్నారు. పనిగంటలు విపరీతంగా పెరుగుతాయన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ, సామాజిక భద్రత వంటి అనేక హక్కులు కోల్పోతారన్నారు. అందుకే దేశములో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఈ లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కోరుతూ మే 20న సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సమ్మె జయప్రదం కోసం విస్తారంగా కింద వరకు కార్మిక వర్గంలోకి విషయాలను తీసుకు వెళ్లేందుకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సంఘటిత అసంఘటిత ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్స్ తదితర కార్మికులందరిలోకీ ఈ పుస్తకాన్ని తీసుకువెళ్లాలన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.ఎం శ్రీనివాసరావు, ఆర్.కె.ఎస్. వి కుమార్, కోశాధికారి ఎస్.జ్యోతీశ్వరావు, జిల్లా కార్యదర్శిలు బి.జగన్, జి. అప్పలరాజు, పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ కో కన్వీనర్ కె.ఎం కుమార మంగళం పాల్గొన్నారు.