- మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ
ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ అన్నారు. విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో ఎపి గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యాన అరసం ప్రతినిధి ఉప్పల అప్పలరాజు అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంవిఎస్.శర్మ మాట్లాడుతూ సమాజానికి ఎంతో అవసరమైన గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన ప్రజాప్రతినిధులు గ్రంథాలయ స్థలాలను దోచుకోవడం బాధాకరమన్నారు. విశాఖలోని గ్రంథాలయ స్థలం విషయంలో అప్పటి విద్యాశాఖ మంత్రి వ్యవహారం అందరికీ తెలిసిందేనన్నారు. గ్రంథాలయాల పట్ల విద్యార్థులకు మక్కువ ఎక్కువగా ఉందన్నారు. గ్రంథాలయాల పరిరక్షణ ఉద్యమంలో విద్యార్థులను, పాఠకులను భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక రూపొందించాలని కోరారు. గ్రంథాలయ పునర్వికాస వేదిక కన్వీనర్ వల్లూరు శివ ప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధిలో ప్రజల తోడ్పాటు ఉందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో గ్రంథాలయాలకు రూ.737 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు రూ.17.37 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయని వివరించారు. గ్రంథాలయాలను కాపాడుకునేందుకు ఏప్రిల్ 17న విజయవాడలో కవులు, రచయితలు, పలు ప్రజా సంఘాల వారితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎయు తెలుగు శాఖాధిపతి జర్రా అప్పారావు, పౌర గ్రంథాలయం కార్యదర్శి డాక్టర్ డివి.సూర్యారావు, దళిత సాహిత్య పీఠం ప్రతినిధి వెలమల సిమ్మన్న. ప్రజా గాయకుడు దేవిశ్రీ, మేడా మస్తాన్ రెడ్డి. శేఖరమంత్రి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.