ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌గా పరమేశ్వర్‌ ఫంక్వాల్‌ బాధ్యతల స్వీకరణ

May 29,2024 00:09 #East Coast Railway, #GM
బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్‌ ఫంక్వాల్‌

 

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌గా పరమేశ్వర్‌ ఫంక్వాల్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఐఐటి కాన్పూర్‌లో విద్యాభ్యాసం చేసిన ఆయన ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ 1988 బ్యాచ్‌ అధికారిగా రైల్వే శాఖలో ప్రవేశించి మూడున్నర దశాబ్దాల పాటు పలు విభాగాల్లో పనిచేశారు. రాజ్‌కోట్‌ డిఆర్‌ఎంగా, అహ్మదాబాద్‌ ఎడిఆర్‌ఎంగా, ఆర్‌ఆర్‌బి ఛైర్మన్‌గా, ఆర్‌డిఎస్‌ఒ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పలు ఉన్నత స్థానాల్లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో ముంబయిలోని పశ్చిమ రైల్వేలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌గా బదిలీపై వచ్చారు. ఆర్‌డిఎస్‌ఒ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో ట్రాక్‌ వంతెనల రంగాలలో రైళ్ల వేగాన్ని పెంచడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రైల్వే ఇంజినీరింగ్‌తో పాటు మానవ వనరుల విధులు, పరిశోధన, డిజైన్‌లు, నిర్వహణలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. ఆయన అంతర్జాతీయ జర్నల్స్‌లో ట్రాక్‌, బ్రిడ్జ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌పై అనేక పరిశోధన పత్రాలను సమర్పించారు. గతంలో బీజింగ్‌ (చైనా), కాల్గరీ (కెనడా), న్యూఢిల్లీల్లో జరిగిన ఇంటర్నేషనల్‌ హెవీ హాల్‌ అసోసియేషన్‌ సమావేశాలలో పత్రాలను సమర్పించమే కాకుండా స్వీడన్‌, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, చైనా, కెనడా, మలేషియా, సింగపూర్‌, ఇటలీలలో వివిధ శిక్షణ అధ్యయనాల్లో పాల్గొన్నారు. ఫంక్వాల్‌కు సాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి. పలు రచనలు చేశారు. అవి హిందీ సాహిత్య పత్రికలలో ప్రచురించబడ్డాయి.

 

➡️