ఛాయా చిత్రాల్లో పోర్టు ప్రగతి

May 29,2024 00:17 #vizag port, #VPT
వైజాగ్‌ పోర్టు ట్రస్టులో ఏర్పాటు చేసిన గ్యాలరీలో కొలువుదీరిన ఛాయాచిత్రాలు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో

వైజాగ్‌ పోర్టు ట్రస్ట్‌ (విపిటి)ది ఎంతో ఘనమైన చరిత్ర. ఇదంతా ఇప్పుడు అబ్బురపరిచే చిత్రరూపంలోకి వచ్చేసింది. దేశంలోనే 12 మేజర్‌ పోర్టుల్లో సరుకు రవాణాలో వైజాగ్‌ పోర్టుకు విశిష్ట స్థానం ఉంది. తూర్పు తీరంలోని పోర్టుల్లో రెండో స్థానం దక్కించుకుంది. ఇటీవలే 45 రోజుల్లో 10 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకును రవాణా చేసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు నెలకొల్పింది. 73 మిలియన్‌ టన్నుల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో 90 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా లక్ష్యంగా సాగుతోంది. ఈ సందర్భంగా పోర్టు సాధిస్తూ వస్తోన్న ప్రగతిపై పోర్టు ఉన్నతాధికారులు పోర్టు ట్రస్ట్‌లో ఒక గ్యాలరీని ఏర్పాటు చేసి 1933 అక్టోబర్‌ 7న పోర్టు ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ చేపట్టిన ప్రగతిపై ‘ఛాయా చిత్ర ప్రదర్శన’ ఏర్పాటు చేశారు. పర్యాటకులు, పోర్టుకు విచ్చేసిన వారంతా ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్నారు. వైజాగ్‌ పోర్టు పురోగతి సాగిందిలా..1933లో మొట్టమొదట నౌక జలదుర్గ 0.33 మిలియన్‌ టన్నుల సరుకుతో పోర్టుకు విచ్చేసింది. 1957లో 2 ఆయిల్‌ బెర్తులు కాల్‌టెక్స్‌ చేసిన డిమాండ్‌ మేరకు క్రూడ్‌ పెట్రోలియం ఉత్పత్తుల కోసం నిర్మాణం చేపట్టారు. అవుటర్‌ హార్బర్‌లో 1976లో రెండు బెర్తుల నిర్మాణం జరిగింది. ఐరన్‌ ఓర్‌ రవాణా జరిగింది. 1978లో విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఫేజ్‌ 1 పనులు ప్రారంభం అయ్యాయి. 1985లో జనరల్‌ కార్గో బెర్త్‌ ఆఫ్‌ షోర్‌ ట్యాంకర్‌ అండ్‌ టర్మినల్‌ అవుటర్‌ హార్బర్‌లో స్థాపించారు. 2000లో అవుటర్‌ హార్బర్‌లో గల ఎల్‌పిజి టర్మినల్‌ బెర్తు నిర్మాణం చేపట్టారు. 2003లో కంటైనర్‌ వెస్సెల్‌ 47.74 మిలియన్‌ టన్నుల నౌక విచ్చేసింది. 2004లో ఈక్యూ 8, ఈక్యూ 9 ఇన్నర్‌ హార్బర్‌లో బిఒటి ప్రాతిపదికన బెర్తులను పోర్టు అభివృద్ధి చేసింది. 2006లో పోర్టు కనెక్టివిటీ రోడ్డు నేషనల్‌ ఫైవేకు అనుసంధానం చేశారు. 2011లో సింగిల్‌ పాయింట్‌ మూరింగ్‌ (ఎస్‌పిఎం)ను కమిషనింగ్‌ చేశారు. అవుటర్‌ హార్బర్‌లో ఈ సంవత్సరంలో 67.42 మిలియన్‌ టన్నులు కార్గో చేశారు. 2013లో మెకనైజ్డ్‌ కోల్‌ హ్యాండ్లింగ్‌ సౌకర్యంగల బెర్తును జనరల్‌ కార్గో బెర్త్‌ వద్ద పోర్టు అభివృద్ధి చేసింది. 2018లో 66 మిలియన్‌ టన్నుల కార్గోను పోర్టు చేసింది. ఈ సంవత్సరం రెండు పానమాక్స్‌ కెపాసిటీ బెర్తులు వెస్ట్‌ క్యూ 7, 8లను ఇన్నర్‌ హార్బర్‌లో పోర్టు అభివృద్ధి చేసింది. 2020లో కాన్వెంట్‌ జంక్షన్‌ బై పాస్‌ రోడ్డు కనెక్టివిటీ కోసం గ్రేడ్‌ సెపరేటర్‌ నిర్మాణాన్ని పోర్టు చేపట్టింది. 2023లో 80.09 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కెపాసిటీ కార్గోకు పోర్టు చేరడం, దేశంలోని 12 మేజర్‌ పోర్టుల్లో క్లీనెస్ట్‌ పోర్టుగా అవార్డును సొంతం చేసుకోవడం పోర్టు చరిత్రలో మరువలేనివి. అదే సంవత్సరం వైజాగ్‌ ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ టర్మినల్‌ భవనాన్ని పోర్టు ప్రారంభించింది. 2024లో వైజాగ్‌ పోర్టు దేశంలోని మేజర్‌ పోర్టుల్లో ఆల్‌ టైం రికార్డు జనరల్‌ కార్గో టన్నేజ్‌ 81.09 మిలియన్‌ టన్నులు కార్గోను సాధించింది. 90 ఏళ్లలో అద్భుత ప్రగతితో పోర్టు దూసుకువెళ్లడం నిజంగా రికార్డు. ఆ విశేషాలన్నీ ఛాయాచిత్రాల్లో మనకు కనిపిస్తాయి.

 

➡️