కార్పొరేట్ సంస్థలపై పోరాడిన గొప్ప యోధుడు ప్రొఫెసర్ సాయిబాబా

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : ఆదివాసీల హక్కుల కోసం కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాటం చేసిన గొప్ప యోధుడు, మేధావి ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రజాసంఘాల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ప్రొఫెసర్ సాయిబాబా నివాళి కార్యక్రమం జరిగింది. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి, డిహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి బూసి వెంకటరావు, ప్రజా సంఘాల అడ్వకేట్ కె.ఎస్ చలం, భారత నాస్తిక సమాజం రాష్ట్ర నాయకుడు టి. శ్రీరామమూర్తి, ఐఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు కె.మల్లయ్య, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు పడాల రమణ, దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, పౌర ప్రజా సంఘాల వేదిక కార్యదర్శి పి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొని ముందుగా ప్రొఫెసర్ సాయిబాబా చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ,కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్ర చేసి ప్రొఫెసర్ సాయిబాబాను 10 ఏళ్ల పాటు జైలులో ఉంచిందని ఆరోపించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో నిర్దోషిగా ఆయన బయటకు వచ్చారని చెప్పారు.జైలు నుంచి విడుదల అయిన వెంటనే ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలను చట్టాలను గెలిచిన తాను మరణం వరకు ఆదివాసీల కోసం పోరాటం చేస్తానని ప్రకటన చేశారని, ఈ ప్రకటన చేసిన కొన్ని మాసాలలోనే అనారోగ్యంతో ప్రాణాలు వదిలారని తెలిపారు. అభ్యుదయ పోరాట యోధులను మట్టు పెట్టడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపా చట్టాన్ని ఉపయోగిస్తుందని, దీనిని రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ సాయిబాబా ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని వారి విజ్ఞప్తి చేశారు.

➡️