టీచర్ల బదిలీ అక్రమాల్లో..బొత్సను వదిలిపెట్టేది లేదు : టిడిపి

Jun 8,2024 00:21 #gandi babji, #tdp visakha
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బాబ్జీ, చిత్రంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

టీచర్ల బదిలీల పేరిట కోట్ల రూపాయలు దోచేసిన మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను వదిలేది లేదని, ఆయనపై కేసు పెట్టనున్నామని టిడిపి విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలు సమయంలో ఎటువంటి బదిలీలూ చేయకూడదన్నారు. అందుకు విరుద్ధంగా బొత్స గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించారని తెలిపారు. ఆయన దోపిడీదారుడని చరిత్రనే చెబుతుందన్నారు. టీచర్లను బదిలీ చేస్తామని రూ.3 నుంచి 6 లక్షలు వసూలు చేశారని, ఆ రూపంలో రూ.100 కోట్లు వరకూ కొట్టేశారని ఆరోపించారు. ఈ విషయమై టీచర్లు ఇప్పటికే చాలామంది ఫిర్యాదు చేశారని వెల్లడించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎపి ప్రజలు కూటమికి చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా గొప్ప విజయం అందించారని ఆనందం వ్యక్తం చేశారు. గాజువాక ప్రజలు తనకు రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజారిటీ ఇచ్చారన్నారు. టీచర్ల బదిలీ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన బొత్స సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీచర్ల తరపున తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బొత్స టీమ్‌పై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని డిపార్టుమెంటుల్లోనూ ఈ తరహా కుంభకోణాలు జరిగాయని, వాటిపైనా దృష్టి పెడతామని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 

➡️