జివిఎంసికి కమిషనర్ ను వెంటనే నియమించాలి

వామపక్షాల కార్పొరేటర్లు డిమాండ్
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)కి వెంటనే కమిషనర్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు, సిపిఐ ఫ్లోర్ లీడర్ ఎ.జె. స్టాలిన్ డిమాండ్ చేశారు. సోమవారం జివిఎంసి ప్రధాన కార్యాలయం ప్రవేశ మార్గం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన సంపత్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిందన్నారు. అయితే ఆయన స్థానంలో వేరే ఎవరినీ కమిషనర్ గా నియమించలేదన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్గా ఉన్న ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ నో ఇన్చార్జిగా నియమిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో, ఆయన బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా, రెగ్యులర్ కమిషనర్ నియామకం జరగలేదని చెబుతూ కాలయాపన చేశారన్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఆవరోధం తొలగిందన్నారు. స్వార్థ రాజకీయాల కారణంగానే, కొత్త కమిషన్ నియామకం జరగటం లేదని ఆరోపించారు. పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో, జివిఎంసిలో పరిపాలన కుంటిపడిందన్నారు. ప్రజలు సమస్యలను చెప్పుకోవడానికి కూడా కమిషనర్ లేకపోవడం శోచనీయమన్నారు.

➡️