రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లుగా కొనసాగించాలి

Feb 1,2025 12:54 #CITU Protest, #gvmc, #in Visakha

జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) డిమాండ్
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : జివిఎంసిలో మునిసిపల్ కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు కుదించడం సరికాదని, పాత పద్ధతిలోనే 62 ఏళ్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, శనివారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు పి. వెంకటరెడ్డి,ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు మాట్లాడుతూ, ఆప్కాస్ నుంచి ఇటువంటి ఆదేశాలు లేనప్పటికీ జివిఎంసిలో 60 సంవత్సరాలు నిండిన 210 మందిని, నిలుపుదల చేశారని, ఈరోజు నుంచి మరికొంతమందిని ఇదే కారణంతో నిలుపుదల చేస్తున్నారని, ఇది అన్యాయం అన్నారు. కార్మికులకు వేతనాలు ఇస్తున్నది జివిఎంసి వారేనని,ఇంతవరకూ పారిశుద్ధ్యం,నీటి సరఫరా, ఇంజనీరింగ్ విభాగాలలో 7500 మందిని 62 సంవత్సరాల వరకు కొనసాగిస్తూ వచ్చారని చెప్పారు. దీనికి ఆప్కాస్ అభ్యంతరం చెప్పలేదన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు 58 సంవత్సరాలు ఉన్నప్పుడు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వారికి కూడా 58 సంవత్సరాలు అమలు చేశారన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు కూడా వర్తింపు చేశారన్నారు. 2022లో పర్మనెంట్ ఉద్యోగులకు 62 సంవత్సరాలు రిటైర్మెంట్ విధానం అమల్లోకి వచ్చినప్పుడు, వీరికి కూడా దానిని అమలు చేస్తూ వచ్చారన్నారు. ప్రత్యేకంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు రిటైర్మెంట్ వయసు అన్నది ఎక్కడా నిర్ణయించబడలేదు అన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు ఎటువంటి గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్ లు గాని చెల్లించటం లేదన్నారు. కనుక వారసత్వంగా డెత్, రిటైర్మెంట్, లాంగ్ సిక్ ఆబ్సెంట్, అనారోగ్య కార్మికుల బిడ్డలకు ఉపాధి కల్పిస్తూ వస్తున్నారని తెలిపారు. 2009లో జివిఎంసి కౌన్సిల్ ఆదేశం ప్రకారం, పబ్లిక్ హెల్త్ కమిటీ వారు రిటైర్ అయిన వారి బిడ్డలకు ఉపాధి కల్పించుటకు అదే ఏడాది జనవరి 6 న తీర్మానం చేశారని వారు గుర్తు చేశారు. 2017లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమ్మె సందర్భంలో కూడా జెఎసితో డీఎంఎ సమక్షంలో జరిగిన ఒప్పందంలో కూడా ఇదే అంశం ఉందని వారు గుచ్చేశారు. కనుక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు 62 సంవత్సరాలు రిటైర్మెంట్ విధానాన్ని అమలు చేయాలని, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు టి.నూకరాజు, జె.ఆర్. నాయుడు, గొలగాని అప్పారావు, శ్రావణ్, ఎం.వి ప్రసాద్, ఎం.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️