విశాఖలో దారుణం.. తల్లిని హతమార్చిన తనయుడు

ప్రజాశక్తి-ములగాడ (విశాఖ) : అదేపనిగా ల్యాప్‌ట్యాప్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్నాడని మందలించిన తల్లిని కత్తితో కొడుకు దారుణంగా చంపిన ఘటన గురువారం రాత్రి విశాఖ జిల్లా మల్కాపురం కోస్టుగార్ట్‌లో చోటుచేసుకుంది. దీనిపై మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాలివి. మల్కాపురం ఇండియన్‌ కోస్ట్‌గార్డులో బల్విందర్‌సింగ్‌ భార్య అల్కాసింగ్‌ (47), ఇద్దరు కొడుకులు అనిమల్‌సింగ్‌, ఆయుష్మాన్‌సింగ్‌తో నివాసం ఉంటున్నారు, హైదరాబాదులోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న అనీమల్‌సింగ్‌ ఇటీవల ఇంటికి వచ్చాడు. రోజుకు ఆరేడు గంటల పాటు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతున్న కొడుకును మందలించిన తల్లి అనుష్క అల్కాసింగ్‌, అతని నుంచి ల్యాప్‌టాప్‌ను లాక్కొంది. దీంతో ఆగ్రహించిన కొడుకు తల్లిని కత్తితో మెడ, ఒంటిపై పొడిచి హతమార్చాడు, తల్లి ఆల్కాసింగ్‌ పెద్ద కేకలు వేయటంతో ఇరుగుపొరుగు చూసి కోస్ట్‌ గార్డ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. కోస్ట్‌గార్డ్‌ అధికారుల నుంచి సమచారం అందుకున్న మల్కాపురం పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దాడికి గురైన అనుష్కను ముందుగా ఐఎన్‌ఎస్‌ కళ్యాణి ఆసపత్రికి, అక్కడి నుంచి విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. మల్కాపురం సిఐ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

➡️