చెత్తపై యూజర్‌ ఛార్జీలు రద్దు చేయాలి

Jun 10,2024 23:48 #cpm gangarao, #gvmc, #usercharges
మేయర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ బి.గంగారావు

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ

చెత్తపై యూజర్‌ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఉదయం సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌, జివిఎంసి 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారిని కలిసి ఎపి మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం – 1955, సెక్షన్‌ 88 కింద రాత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. త్వరలో కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి చెత్తపై యూజర్‌ ఛార్జీలు రద్దు చేస్తూ తీర్మానం చేయాలని కోరారు. చెత్తపై యూజర్‌ ఛార్జీలు ప్రజలకు తీవ్ర భారంగా మారాయని, ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నును మార్చి ప్రజలపై భారీగా పన్ను భారం మోపారని తెలిపారు. ప్రతి ఏడాదీ 15 శాతం ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ఆస్తి పన్ను పెరిగే పద్ధతిని అమలులోకి తెచ్చారని పేర్కొన్నారు. మురుగునీటి పన్ను నెలకు రూ.40 విధించారని, త్వరలో నీటి కుళాయిలకు మీటర్లు పెట్టి నీటి ఛార్జీలను 4 రెట్లు పెంచబోతున్నారని తెలిపారు. ఇప్పటికే విశాఖ ఉత్తరం, పశ్చిమం, తూర్పు నియోజకవర్గాల పరిధిలో నీటి కుళాయిలకు మీటర్లు బిగించారని, ఆ పన్ను భారాలన్నింటినీ ఉపసంహరించాలని కోరారు. క్లీన్‌ ఎపి (క్లాప్‌) పేరిట గత ప్రభుత్వం 600కు పైగా క్లాప్‌ వాహనాలకు 5 సంవత్సరాల ప్రాతిపదికన నెలకు రూ.65 వేలు జివిఎంసి చెల్లించేలా నిర్ణయం చేసి, బలవంతంగా అమలు జరిపిందని తెలిపారు. ఆ వాహనం విలువ రూ.6 లక్షలే అయినప్పటికీ గడిచిన రెండున్నరేళ్లలో ఒక్కొక్క వాహనానికీ రూ.25 లక్షలు చొప్పున సుమారు రూ.150 కోట్లును జివిఎంసి కాంట్రాక్టర్‌కు చెల్లించిందని, ఇది పూర్తిగా నిలువదోపిడీ అని తెలిపారు. ఈ క్లాప్‌ ఒప్పందాన్ని వెంటనే రద్దుచేసి, వాహనాలన్నింటినీ జివిఎంసి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెత్తపై యూజర్‌ ఛార్జీల రద్దు కోసం కౌన్సిల్‌లో సిపిఎం ప్రవేశపెడుతున్న తీర్మానానికి టిడిపి, వైసిపి, జనసేన, బిజెపి మద్దతు తెలపాలని కోరారు. అలాగే నగర ప్రజలెవరూ చెత్తపై యూజర్‌ ఛార్జీలు చెల్లించొద్దని విజ్ఞప్తి చేశారు.

 

➡️