విశాఖ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన విశాల్ గున్ని

Feb 12,2024 12:11 #Visakha
Visakhapatnam Range DIG Vishal Gunny

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : 2010 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి విశాల్ గున్ని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని డిఐజి రేంజ్ కార్యాలయంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తమ శాఖ లోని అన్ని విభాగాలను పట్టిష్ట పరిచేందుకు కృషి చేస్తానని , ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రజల లక్ష్యంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చేయటమే తన ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. అదేవిధంగా మన్యం, పాడేరు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎన్డిపిఎస్ కేసులపై ప్రత్యేకంగా దృష్టిపెడతానని రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తూ ముందుకు వెళతానని అన్నారు. తాను అన్నివేళలా అందుబాటులో మీడియాకు అందుబాటులో ఉంటానని వార్తలు ప్రచురించే ముందు తనను లేదా తమ ఎస్పీ స్థాయి అధికారులను సంప్రదించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ఈ రోజున సోషల్ మీడియాలో పలువురు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వార్తలు ప్రచురించడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని కావున వార్త ప్రచురించే ముందు దానిని నిజనిర్ధారణ చేసుకోవాలని తద్వారా పత్రికలు విలువలు కూడా పెరుగుతాయని ఆయన మీడియాను కోరారు. ఇప్పటివరకు విజయవాడ నగరం లో డిసీపి గా విధులు నిర్వహించిన అయన పదోన్నతిపై విశాఖపట్నం రేంజ్ డిఐజిగా బాధ్యతలు చేపట్టారు.

➡️