వివోఎలకు 6 నెలల బకాయిలు చెల్లించాలి

Jan 27,2025 12:22 #in Visakha, #VOA, #voa dharna, #voa leaders

ఆర్.కె.ఎస్.వి కుమార్ డిమాండ్
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : వివోఎలకు బకాయి ఉన్న 6 నెలల జీతాలను చెల్లించాలని, 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని కోరుతూ సోమవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఎపి వెలుగు విఓఎ(యానిమేటర్స్), ఉద్యోగుల సంఘం (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు నిర్వహించారు. దీక్షా శిబిరాన్ని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివోఎల సమస్యల పరిష్కారం చేయడంలో తీవ్ర అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. ప్రతినెలా జీతం ఇవ్వాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం నిర్వహించకపోవడం దుర్మార్గమన్నారు. 6 నెలలుగా జీతం ఇవ్వకుండా పని చేయించుకోవడం వెట్టి చాకిరి అవుతుందన్నారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని, 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు. డిసెంబర్ 16న సెర్ఫ్ సిఈవో సమక్షంలో జరిగిన చర్చలు, నిర్ణయాలు ఇంత వరకూ అమలు కాకపోవడం అత్యంత శోచనీయమన్నారు. అక్రమంగా తొలగించిన వివో ఎ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడం కోర్టుధిక్కారమన్నారు. విపరీతమైన పనిభారం పెంచారన్నారు.మహిళా మార్ట్ లలో బలవంతపు కొనుగోళ్ళు వల్ల ప్రజలు, గ్రూపు సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేక వ స్తోందన్నారు. అలాగే సమస్యలు పరిష్కారం కోసం జాయింట్ మీటింగ్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు. గ్రూప్ సభ్యులు అభయహస్తం డబ్బులు వెంటనే చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోకపోవడం అన్యాయం అన్నారు. ఈ విధంగా ప్రజలు, వివోఎల సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం నిరసిస్తూ, మూడు రోజులు నిరాహార దీక్షల కార్యక్రమానికి సిఐటియు సంపూర్ణ మద్దతునిస్తుందని ప్రకటించారు. ఈరోజు దీక్షా శిబిరంలో ప్రతి మండలం నుండి అయిదుగురు ముఖ్యమైన నాయకులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఆనందపురం నుండి పి. అపర్ణ, ఎం.శ్యామల, పద్మ, కుమారి, లావణ్య, పెందుర్తి నుండి వి.శ్రీలక్ష్మి,ఎ.శారద,జి. రమణి, బి.దేవి, పి.కృష్ణ వేణి, పద్మనాభం నుండి పి.కంచమ్మ,పి.సంతోషి, ఎస్.వరలక్ష్మి,కె. అప్పలకొండ, భీమిలి నుండి యు.పార్వతి, పి.వెంకటలక్ష్మి, కె.వెంకటలక్ష్మి, పార్వతి, హైమా నిహారాదీక్షల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూనియన్ ఊvoa గౌరవాధ్యక్షురాలు పి.మణి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అపర్ణ, కంచమ్మ , కోశాధికారి శ్రీలక్ష్మి, యూనియన్ ముఖ్య నాయకులు వెంకటలక్ష్మి, పార్వతి, శారద తదితరులు నాయకత్వం వహించారు.

➡️