విశాఖలో భారీ ర్యాలీ
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : వక్ఫ్ బోర్డు భూముల పై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ నగరంలో, విశాఖ మైనార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్ఐసి దరి అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి, జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రాక్టీస్ న్యాయవాది మహమ్మద్ గౌస్ ముద్దిన్ ఖాన్, హైదర్ అలీ సింకా, జహీర్ అహ్మద్,ఆల్ మాస్క్ ప్రెసిడెంట్ అహ్మదుల్లా ఖాన్, మహమ్మద్ ఇబ్రహీం, మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఫారూఖి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,వక్ఫ్ ఆస్తుల రద్దు,తద్వారా భారతీయ ముస్లింల మతపరమైన, సాంస్కృతిక,రాజకీయ, ఆర్థిక గుర్తింపును బలహీనపరిచే అవకాశం కల్పించే నిబంధనలను ఈ బిల్లు కలిగి ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందిని. ఇటువంటి చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా దేశంలోని అన్ని మతపరమైన మైనారిటీల హక్కులకు దీర్ఘకాలిక ముప్పును కలిగిస్తుందని ఆరోపించారు.
వక్ఫ్ బోర్డు యొక్క ముస్లిం గుర్తింపును మార్చే చర్య ఆమోదయోగ్యం కాదన్నారు.భవిష్యత్తులో ఇతర వర్గాలకు విస్తరించే ప్రమాదకరమైన దృష్టాంతాన్ని సూచిస్తుందన్నారు.
భారతదేశం చాలా కాలంగా మత సామరస్యం,పరస్పర గౌరవం,సాంస్కృతిక సమ్మేళనానికి నిలయంగా కొనసాగుతుందన్నారు. ఈ విలువలకు భంగం కలిగించడం మంచిది కాదన్నారు.వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం,లౌకిక ప్రజాస్వామ్య ప్రతినిధుల ఏకీకృత స్వరానికి సాక్ష్యంగా నిలిచిందన్నారు.కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పలు రాజకీయ పార్టీల నాయకులు లేవనెత్తిన,అభ్యంతరాలలో చాలా వాటికి ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదన్నారు. న్యాయాన్ని నిలబెడదాం, అన్ని వర్గాల గౌరవాన్ని కాపాడుకుందాం , భారతదేశం యొక్క లౌకిక ప్రజాస్వామ్య నైతికత పట్ల మన నిబద్ధతలో ఐక్యంగా నిలబడదాం,అంటూ నినాదాలు చేశారు.
