ప్రజాశక్తి – వినుకొండ : స్థానిక లయోలా హైస్కూల్లో జరుగుతున్న అండర్-17 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. ఖోఖోలో విశాఖ జట్టు విజేతగా నిలవగా, రన్నరప్ స్థానాన్ని అనంతపురం దక్కించుకుంది. ఫుట్‌బాల్‌లో వైఎస్‌ఆర్ కడప విజయం సాధించగా చిత్తూరు జట్టు రెండో స్థానంలో నిలిచింది. బాల్‌బ్యాడ్మింటన్‌లో గుంటూరు జిల్లా జట్లు గెలుపొందింది. విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి స్కూల్లో ఆట వస్తువులుండేలా రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తోందన్నారు. పాఠశాలల్లో క్రీడా స్థలాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోందన్నారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని, రెండు శాతం రిజర్వేషన్ కూడా లభిస్తుందని చెప్పారు. అయితే దీన్ని 4 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన బసవరా త్రిబుల్ ఐటీ సీటును స్పోర్ట్స్ కోటాలో సాధించారని తెలిపారు.