కావలికి చేరిన విశాఖ ఉక్కు ప్రచార జాతా

Feb 1,2025 00:19
ఫొటో : మాట్లాడుతున్న పసుపులేటి పెంచలయ్య

ఫొటో : మాట్లాడుతున్న పసుపులేటి పెంచలయ్య

కావలికి చేరిన విశాఖ ఉక్కు ప్రచార జాతా

ప్రజాశక్తి-కావలి : నెల్లూరు నగరంలో ఫిబ్రవరి 1,2,3 తేదీలలో జరుగుతున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు సందర్భంగా విశాఖలో ప్రారంభించిన ”విశాఖ ఉక్కు పరిరక్షణ ప్రచార జాత”శుక్రవారం కావలికి చేరింది. ఈ జాతాకు సిపిఎం కావలి పట్టణ కమిటీ మద్దూరుపాడు క్రాస్‌రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికి, బైక్‌ ర్యాలీతో పట్టణంలోకి ఆహ్వానం పలికింది. అనంతరం ఉదయగిరి బ్రిడ్జి కూడలిలో పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ఈ జాతా విశాఖపట్నంలో 29వ తేదీన ప్రారంభించారని, శుక్రవారం కావలికి చేరుకుందని తెలిపారు. ఈ జాతా ముఖ్య ఉద్దేశం విశాఖ ఉక్కు ప్లాంటును ప్రయివేటీకరణ చేయరాదని, ప్రత్యేక నిధులు కేటాయించి, స్టీల్‌ ప్లాంట్‌ను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తూ కావలికి చేరిందన్నారు. నెల్లూరులో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ జాతాకు నాయకత్వం వహిస్తున్న బి.గుర్రప్ప మాట్లాడుతూ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖఉక్కు ప్లాంటు అని తెలియజేశారు. ఈ ప్లాంటుకు తక్కువ ధరలకు రైతులు భూములు ఇచ్చారని, వారి కుటుంబాల్లో ఉద్యోగాలు ఇస్తారని ఆశపడ్డారన్నారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇప్పుడు ఉన్న ఉక్కు ప్లాంటును కేంద్రంలో పరిపాలిస్తున్న ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం ఉక్కు ప్లాంటును ప్రయివేటీకరణ చేయాలని తపన పడుతుందన్నారు. అందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తందానా అంటుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు ప్లాంటు ప్రయివేటీకరణ కాకుండా ఆపాలన్నారు. ఎన్నికల ప్పుడు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖపట్నం ఉక్కు ప్లాంటును ప్రజామద్దతుతో పోరాటాలు చేసి సాధించుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వి.రామస్వామి, రామ్మోహన్‌ గౌడ్‌, బి.గుర్రప్ప, జి.శ్రీనివాసరావు, బి.మహేష్‌, వి.సోమేశ్‌, జాతా నాయకులతోపాటు స్థానిక నాయకులు పి.తిరుపాలు, కె.చెన్నయ్య, వి.బాబురావు, కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️