విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలి

Sep 1,2024 00:17 #AITUC, #Amarjeeth cour
Aituc Dharna

 ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్‌లో విలీనం చేసి, నూటికి నూరు శాతం ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని, మిగిలి ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులకు జీతాల్లో కోత విధించరాదని ఎఐటియుసి జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి అమర్జిత్‌కౌర్‌ ఉక్కు యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి ఆధ్వర్యాన ఉక్కు ఎల్‌ అండ్‌ డిసి వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఉద్యమాల ద్వారా ఏర్పాటైన ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం తన అనుకూలురైన పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్నారు. దీనిని ఎఐటియుసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్రం ఉక్కుకు కావలసిన ఐరన్‌ ఓర్‌, ఇతర ముడిసరుకులు సరఫరా చేసి ప్లాంట్‌ మనుగడకు కృషిచేయాలని కోరారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, లేకుంటే కలిసి వచ్చే కార్మిక సంఘాలతో ఐక్య ఉద్యమాన్ని ఎఐటియుసి తీవ్రతరం చేస్తుందని స్పష్టంచేశారు. ఈ ధర్నాలో ఎఐటియుసి నాయకులు ఆర్‌.రవీంద్రనాథ్‌, జి.ఓబులేసు, కెఎస్‌ఎన్‌.రావు, డి.ఆదినారాయణ, జె.రామకృష్ణ, మసేన్‌రావు, కె.రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️