విశాఖ ఉక్కును రక్షించకుంటాం : ఎస్‌ఎఫ్‌ఐ-డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉత్తరాంధ్రకు జీవనాడి గా ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటుపరం కాకుండా రక్షించుకుంటామని ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా కార్యదర్శి సి హెచ్‌ వెంకటేష్‌, డి వై ఎఫ్‌ ఐ జిల్లా కన్వీనర్‌ బి.హరీష్‌ లు అన్నారు. మంగళవారం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఎస్‌ ఎఫ్‌ ఐ,డి.వై ఎఫ్‌ ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ … ఎన్నో ప్రాణాత్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వేలాది ఉద్యోగాలు అందించిన పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం, అమ్మేయడం వంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం ద్వారానే పేదలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విశాఖ ఉక్కు ను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం వెంటనే స్టీల్‌ ప్లాంట్‌ కు స్వంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి విశాఖ ఉక్కు పరిశ్రమ ను కాపాడుకోవాలని కోరారు. విశాఖ ఉక్కును సెయిల్‌ లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నా లో ఎస్‌ ఎఫ్‌ ఐ నాయకులు రవి, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️