ప్రమాద రహిత జిల్లాగా విశాఖ రూపుదిద్దుకోవాలి : కలెక్టర్‌ మల్లిఖార్జున

Feb 10,2024 13:05 #AP police, #visaka

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : రాష్ట్రంలోనే విశాఖపట్నం ప్రమాద రహిత జిల్లాగా రూపుదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున, పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ.రవిశంకర్‌ ఆకాంక్షించారు. ఆర్‌.కె.బీచ్‌ దగ్గర గల కాళీమాత టెంపుల్‌ వద్ద ఆర్సలర్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా సిఎస్‌ఆర్‌ నిధులు రూ.57 లక్షలతో కొనుగోలు చేసిన 32 మోటార్‌ సైకిల్స్‌, ఒక క్రేన్‌ వాహనం ప్రారంభోత్సవ కార్యక్రమం విశాఖ సిటీ పోలీస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్‌ కమిషనర్‌తో కలిసి 33 వాహనాలకు పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో రూ.30 కోట్లు వెచ్చించి రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్‌ నివారణ కొరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్‌, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలతో 2022 కంటే గతేడాది రహదారి ప్రమాదాలు, సైబర్‌ క్రైం గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. 2023 రహదారి ప్రమాదాల నివారణలో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకు ట్రాఫిక్‌ పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు. సివిల్‌, ట్రాఫిక్‌, జివిఎంసి,ఆర్‌ అండ్‌ బి, ఎన్‌ హెచ్‌, విఎంఆర్డిఎ అధికారులు చేపట్టిన జాయింట్‌ తనిఖీల్లో గుర్తించిన సమస్యలపై ప్రత్యేకంగా దష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆర్సలర్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా సిఎస్‌ఆర్‌ నిధులు రూ.100 లక్షలతో కేజీహెచ్‌, విక్టోరియా ఆసుపత్రుల్లో సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుచేశామని అన్నారు.

పోలీస్‌ కమిషనర్‌ డా. ఎ. రవిశంకర్‌ మాట్లాడుతూ జిల్లాలో ట్రాఫిక్‌ సమస్య, ప్రమాదాల నివారణ కోసం ఇకపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ అధిగమిస్తే పోలీసులతో పాటు ప్రజలు కూడా తెలియజేయవచ్చన్నారు. కేవలం వాహనం నెంబరుతో నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్స్‌ రద్దు చేస్తామని చెప్పారు. పోలీసుల చర్యలకు నిధులు అవసరమని, ఇందుకు సహకరించిన ఎఎంఎన్‌ఎస్‌ ఇండియా ఈడిని ఆయన అభినందించారు. రూ.35 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో 32 మోటార్‌ సైకిల్స్‌, రూ.22 లక్షలతో ఒక క్రేన్‌ ను ఎఎంఎన్‌ఎస్‌ సమకూర్చినట్లు చెప్పారు. హైదరాబాద్‌, ముంబయి వంటి ప్రాంతాల్లో కూడా లేనివిధంగా ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, డిస్ప్లే బోర్డు, వార్నింగ్‌ సిస్టం వంటి అధునాతన సదుపాయాలు ఈ మోటార్‌ సైకిల్స్‌ లో ఉండటం గమనార్హమని అన్నారు. ఈ కార్యక్రమం లో జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఫక్కీరప్ప ఏఎంఎన్‌ఎస్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌ విశ్రాంత ఏఎస్పీ టి.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, హెచ్‌.ఎం.ఎం.ఆర్‌.డీఎస్‌ వర్మ, డీసీపీ, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️