ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కుల మత పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు, ఏఐటియుసి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎస్.ఆంజనేయులు నాయక్, కాసా రాంబాబులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకై నేటి నుండి మొదటి విద్యార్థి యువజన సంఘాలు, 2వ రోజు సిఐటియు, ఏఐటియుసి 3వ రోజు రైతు సంఘాలు ఏఐకేఎస్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 3 రోజులపాటు గాంధీ పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. మూడేళ్లుగా కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం దుర్మార్గమన్నారు. 1964లో విద్యార్థులు, యువత ఆకాంక్షల నుంచి పుట్టిన నినాదం. తెలుగు వారందరినీ ఏకం చేసి చేపట్టిన పోరాట ఫలితంగా వేలమంది త్యాగఫలం, 32మంది ప్రాణత్యాగంతో పురుడుపోసుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమపై కార్పొరేట్‌లకు కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై అధికార టిడిపి, జనసేన, ప్రతిపక్ష వైసిపి నోరు మెదపకపోవడం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడమేనన్నారు. రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, ఏఐటియుసి నాయకులు యు.రంగయ్య, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే తమ జీవితాలు మారతాయని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కలలుగన్నారు ఫ్యాక్టరీ కోసం 64 గ్రామాల్లో 26 వేల ఎకరాల భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిశ్రమ వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర నటిస్తున్నాయని మండిపడ్డారు. ఉద్యమం ద్వారా నిద్రలేపాలని ప్రజా సంపద పరిరక్షణకు ప్రజలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.