దేశవ్యాప్త ఉద్యమంతోనే విశాఖ ఉక్కు పరిరక్షణ

దేశవ్యాప్త ఉద్యమంతోనే విశాఖ ఉక్కు పరిరక్షణ

ప్రజాశక్తి- ఉక్కునగరం : అఖిలభారత సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ పిలుపుమేరకు విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని ఉక్కు పరిశ్రమలలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందనిస్టీల్‌ ప్లాంట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె. అయోధ్యరామ్‌ అన్నారు.కోల్‌కతాలో స్టీల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం వివరాలను గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశ విధానాలను అత్యంత వేగంగా అమలు చేస్తోందని తపన్‌సేన్‌ విమర్శించారన్నారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో విఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టి, ప్రయివేటుకు విశాఖ ఉక్కును కట్టబెట్టే ప్రక్రియను ప్రారంభించిందని స్పష్టం చేశారన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ, సొంత గనులను కేటాయించినప్పుడే సమస్య పరిష్కారమైనట్లు భావించారన్నారు. ఒడిశాలోని సెయిల్‌ ఐరన్‌ ఓర్‌ను అదాని ప్రైవేటు సంస్థకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం సాగుతోందన్నారు.. విశాఖ స్టీల్‌ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్ట అన్ని తపన్‌సేన్‌ భావించారన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మికులంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని కొల్‌కతా సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమమొక్కటే తక్షణ కర్తవ్యమని, ఆ దిశగా దేశవ్యాప్త ఉద్యమానికి స్టీల్‌ కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యు రామస్వామి, ఒవి రావు, స్టీల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి లలిత్‌ మిశ్రా, స్టీల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న అయోధ్యరాం

➡️