ప్రజాశక్తి-కడప అర్బన్ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని, వెనుకబడిన ప్రాంతాలకు విభజన చట్టం హామీలు అమలు చేయాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కడప ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట వామపక్ష కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు బి.దస్తగిరిరెడ్డి, అధ్యక్షులు ఎమ్మి సుబ్బారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ ఉక్కు ప్రయివేటీకరించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రయివేటీకరణ ఆపాలని 1315 రోజులుగా విశాఖ నగరంలోనూ, రాష్ట్రంలోనూ పోరాటంసాగిస్తున్నా, ప్రజాభిప్రాయాన్ని పెడచెవిన పెడుతూ మోడీ ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకే పరిశ్రమ దారదత్తం చేయడానికి కంకణం కట్టుకుని పొమ్మనకుండా పొగపెట్టే పనులు చేస్తున్నదని విమర్శించారు. 3వ సారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రయివేటీకరణ పనుల్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పరిశ్రమ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసులు రెడ్డి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి లేవాకు నాగ సుబ్బారెడ్డి, కార్మిక సంఘాల నాయకులు చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, బాదుల్లా, రైతు సంఘం నాయకులు బాలచంద్రయ్య, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
