బాల్‌ బ్యాడ్మింట్‌ ఛాంపియన్‌ షిప్‌ విజేత విశాఖ

విజేతలకు బహుమతులు అందజేస్తున్న రిటైర్డ్‌ జడ్జి పైలా సన్నిబాబు

ప్రజాశక్తి-అచ్యుతాపురం :

9వ ఆంధ్ర రాష్ట్ర జూనియర్‌ అండర్‌-19 బాల బాలికల బాల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో విశాఖ బాలురు, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. విశాఖ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మండలం నునపర్తి గ్రామంలో శ్రీరామబాల్‌ బ్యాడ్మింటన్‌ క్లబ్‌ ఆవరణలో మూడు రోజులపాటు ఈ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. 13 ఉమ్మడి జిల్లాల నుంచి జట్లు వచ్చాయి. బాలుర విభాగంలో శ్రీకాకుళం జట్టుపై విశాఖ జిల్లా జట్టు, బాలికల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టుపై విశాఖ జిల్లా జట్టు గెలుపొందారు. డిసెంబర్‌ నెలలో జరిగే జాతీయస్థాయి పోటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ జట్లను ఏపీ రాష్ట్ర సంఘ కార్యదర్శి ఆర్‌.వెంకట్రావు ప్రకటించారు. ఈ పోటీలలో విజేతలకు స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ రిటైర్డ్‌ జడ్జి పైలా సన్నిబాబు, ఉత్తరాంధ్ర బీసీ సంఘం అధ్యక్షులు నరవ రాంబాబు, బాల్‌ బ్యాడ్మింటన్‌ అఖిలభారత సమాఖ్య జనరల్‌ సెక్రటరీ వై రాజారావు, రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులు వై.విజరు శంకర్‌ రెడ్డి, ఆర్‌ వెంకట్రావు చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు. క్రీడా పోటీల ప్రాంగణాన్ని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సందర్శించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ ఆర్‌వివి నగేష్‌, పరవాడ మాజీ ఎంపిపి మసవరపు అప్పలనాయుడు, జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షులు ఆర్‌. ప్రభూజీ, ప్రధాన కార్యదర్శి గొంప నరసింహనాయుడు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పెదపూడి శంకర్రావు పాల్గొన్నారు.

➡️