పాడి రైతులను కుంగదీస్తున్న యాజమాన్యం
సేకరించిన పాలను మార్కెట్ చేసుకోలేకపోతున్న పాలక వర్గం
పాల సేకరణ, నాణ్యతా ప్రమాణాలపై ఆంక్షలు
కోర్టులను ఆశ్రయిస్తామంటున్న రైతులు
నేడు కలెక్టరేట్ వద్ద పాల రైతు సంఘం థర్నా
ప్రజాశక్తి – రామభద్రపురం : పాడి రైతుల జీవనోపాదులను దెబ్బతీస్తూ విశాఖ డెయిరీ తీసుకుంటున్న నిర్ణయాలు రైతులను కుంగదీస్తున్నాయి. ఈ ప్రాంత రైతన్నలు పాడి పశుపోషణ జీవనాధారంగా ఎంచుకొని పాల అమ్మకాల ద్వారా జీవనం సాగిస్తున్నారు. వీరికి అండగా విశాఖ డెయిరీ ముందుకు వచ్చి దశాబ్దాల కాలంగా గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆడారి తులసీరావు డెయిరీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. రైతులకు విద్య, వైద్య, ఉద్యోగాల కల్పన కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి డెయిరీని లాబాల బాటలో నడిపించారు. అయితే తులసీరావు మరణం తరువాత వీరి కుమారుడు ఆనంద్ కుమార్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. విశాఖ డెయిరీ పరిధిలో 3.80 లక్షల మంది పాల రైతులున్నారు. డెయిరీ నిర్ణయాలతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. రామభద్రపురం మండలంలోని 70 సంఘాల పరిధిలో 5 వేల మంది పాడి రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు, నిరసన ర్యాలీలు నిర్వహించి డెయిరీ నిర్ణయాన్ని ఎండగడుతూ పాల ధరలు పెంచాలని, ఏటా రెండుసార్లు బోనస్‌లు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. డెయిరీలో అవినీతి రాజ్యమేలుతుందని, నిధులు గోల్ మాల్ అయ్యాయని అందుకే నష్టాలు సాకు చూపి పాల ధరలు అమాంతం తగ్గించారని నిరసనలు వెల్లువెత్తాయి. దీనికి తోడు డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా వారి సమస్యలపై గలమెత్తి నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు నిర్వహించారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగి ప్రభుత్వం సభా సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక కమిటీ కూడా వేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో పలు విచారణలు కూడా జరిగాయి. అయితే అనూహ్యంగా డెయిరీ చైర్మన్ ఆడారి ఆనందకుమార్, పాలక వర్గం కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రయించి బీజేపీలో చేరడం గమనార్హం. తాజాగా రైతు నెత్తిపై మరో పిడుగుఇప్పుడు తాజాగా రైతు నెత్తిపై మరో పిడుగు పడింది. పాలను మార్కెట్ చేయలేక పోతున్నామని, పాల సేకరణ తగ్గించుకోవాలని లేదంటే వారానికి ఒక రోజు పాల సేకరణ నిలుపుదల చేస్తామని, నాణ్యత లేని పాలు తిరిగి పంపి వేస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ పాలక వర్గం సభ్యులు రైతన్నకు సమాచారం అందించారు. విశాఖ డెయిరీని నమ్ముకొని పశువుల్ని పోషిస్తున్న రైతుకు ఈ చేదు సమాచారం పాడిపై పెంచుకున్న ఆశలు నిరాశ అయ్యేలా చేసింది. పూటకు 30 లీటర్లు ఆవు పాలు 10 లీటర్ల గేదే పాలు ఉండాలని, వెన్న శాతం ఆవు3, గేదె 5 శాతం ఉంటూ ఎస్‌ఎన్‌ఎఫ్8.8.20గా లేకపోతే ఆ పాలు తిరిగి సేకరణ కేంద్రాలకే పంపివేస్తామని సంబధిత డెయిరీ అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే పాడి పశువు ఆరోగ్యం, ఈనిక కాలం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వెన్న శాతంలో హెచ్చు తగ్గులు రావడం సహజం. గతంలో ఇలా వస్తే ధర తగ్గించి లేదా పెనాల్టీ ధరతో పాలను తీసుకొనేవారు. ఇప్పుడు సేకరించి పంపిన పాలు నాణ్యతా ప్రమాణాలు పేరుతో తిరిగి వెనక్కి పంపించడం సంఘాలను నిర్వీర్యం చేసే కుట్రగా పలువురు రైతులు విమర్శిస్తున్నారు. అలా పంపిన పాలు వినియోగానికి పనికి వచ్చే సమయం దాటిన తరువాత వస్తాయని మరల ఆ పాలను రైతుకు ఎలా ఇవ్వగలం అని సేకరణ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘ బైలా నిబందనల మేరకు కోర్టులను ఆశ్రయించి న్యాయం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని పలువురు రైతులు హెచ్చరిస్తున్నారు. అత్యధిక లాభాల బాటలో ఉన్న డెయిరీని నష్టాల ఊబిలోకి నెట్టి రైతుల జీవనోపాదులు దెబ్బతీసే కుట్రలు మానుకోవాలని రైతు శ్రేయస్సుకు పాత పద్ధతిలోనే పాల సేకరణ జరపాలని, తగ్గించిన ధరలు పెంచాలని సంక్షేమ కార్యక్రమాలు శత శాతం అమలు చేయాలని ప్రజాసంఘాలు, పలువురు రైతులు కోరుతున్నారు.
ప్రత్యక్ష రాజకీయాలతో రైతులకు అవస్థలు
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. వేల కోట్ల లాభాల్లో ఉన్న డెయిరీ నష్టాల్లో ఉన్నట్లు ప్రకటించారు. అయితే డెయిరీ ఆస్తులు, లాభాలు సొంతానికి వాడుకొని ఎన్నికల్లో ఆ సొమ్ము వినియోగించడమే నష్టాలకు కారణం అని కొందరు చెబుతున్నారు. దీనికి ఊతమిస్తూ పాల సేకరణ ధర రూ.5 నుంచి 10 రూపాయలు తగ్గించడంతో, ఇప్పటికే పాలకు గిట్టుబాటు ధర లేక దానా ఖర్చులకే పాల రాబడి సరి పోవడం లేదని భావిస్తున్న రైతు నెత్తిన పిడుగు పడినట్లయ్యింది.