వివేకానంద కళాశాల గుర్తింపుని రద్దు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బిఈడి మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పేపర్‌ లీకేజ్‌ కి పాల్పడిన ఘటనలో అరెస్ట్‌ అయిన స్వామి వివేకానంద కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌.ఎఫ్‌.ఐ పల్నాడు జిల్లా కన్వీనర్‌ కె.సాయి కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం విలేకరులతో సాయి కుమార్‌ మాట్లాడుతూ … పలుమార్లు పేపర్లు లికేజిలకు పాల్పడిన కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థుల భవిష్యత్తును విచ్చినం చేసేందుకు కళాశాల యాజమాన్యం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. చదువుకొని పరీక్షలు రాయాల్సిన విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదన్నారు. ఎంతో కష్టపడి చదువుకున్న విద్యార్థులు చాలా అవకాశాలను కోల్పోతారన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ప్రభుత్వ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. బిఈడి కళాశాలలు మొదలుకొని పరీక్షలు వరకు రాష్ట్రంలో ఉన్న పలు కళాశాలలో పేపర్‌ లీకేజీలు జరుగుతున్నాయని దీనిమీద యూనివర్సిటీలు ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ లేకపోవడం లోపాయి కారి ఒప్పందాలతో యూనివర్సిటీ అధికారులు కూడా ఉండటం కారణమన్నారు. మంత్రి నారా లోకేష్‌ స్పందించి పేపర్‌ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి ఘటనల పట్ల జరిమానాలు కాకుండా ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️