ఉద్యోగుల బదిలీల్లో ఇష్టారాజ్యం

Sep 29,2024 00:05

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జరిగిన ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులలో ఎక్కువ మంది తాము కోరుకున్న స్థానాలకు వెళ్లడం, అదేస్థానంలో కొనసాగడానికి ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకుని వారి సిఫార్సు లేఖలను అందించారు. గతంలో ఉద్యోగ నియామకం కోసం లంచాలిచ్చే వారు. ఇప్పుడు కోరుకున్న ప్రదేశానికి వెళ్లడానికి, తమ స్థానంలో కొనసాగడానికి ప్రజా ప్రతినిధులు, పై అధికారులకు లంచాలిచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఉద్యోగ సంఘాల్లో పనిచేసే వారికి ఉన్న మినహాయింపులను కూడా కొంత మంది అక్రమంగా వినియోగించుకునేందుకు సంఘం నాయకులు సహకరించారనే విమర్శలు లేకపోలేదు. దాదాపు 35 రోజుల పాటు జరిగిన బదిలీల ప్రక్రియలో ఈసారి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు ఆస్కారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. పంచాయతీ రాజ్‌లో అత్యంత పారదర్శకంగా బదిలీలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించినా ఆ శాఖ పరిధిలో జిల్లా పరిషత్‌ ఉద్యోగుల బదిలీల్లోనే ఎక్కువగా ఉత్తర-దక్షిణలు పనిచేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారు ఇక్కడే కొనసాగారు. టిడిపి ఎమ్మెల్యేల సిఫార్సులను సైతం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా పక్కన పెట్టడంపై పలువురు గుర్రుగా ఉన్నారు. అంతేగాక ఉద్యోగ విరమణకు కనీసం ఏడాది ముందు బదిలీ చేయరాదని, వికలాంగులకు, అనార్యో గంతో ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలనే నిబంధ నలనూ పట్టించుకోకుండా తమను ప్రసన్నం చేసుకోని వారిని అత్యంత దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరని ప్రభుత్వం చెప్పినా వారికిష్టమైన వారిని కొనసాగించి ఇష్టం లేనివారిని దూర ప్రాంతాలకు బదిలీ చేశారు.ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌ మెంట్‌, మున్సిపల్‌ పరిపాలన, గ్రామ, వార్డు సచివాలయాలు, పౌరసరఫరాల శాఖ, మైనింగ్‌, జియాలజీ, అన్ని ఇంజినీరింగ్‌ శాఖలు, దేవాదాయ, రవాణ, పరిశ్రమలు, విద్యుత్‌, స్టాంప్సు, రిజిస్ట్రేషన్‌, కమర్షియల్‌ టాక్సు జిఎస్‌టి తదితర శాఖల బదిలీలకు అవకాశం కల్పించగా ఎక్కువ శాఖల్లో శాఖలలో జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగులకు ప్రజా ప్రతినిధుల సిఫార్సుల లేఖల ఉన్నా ఎంతోకొంత ముట్టజెప్పనిదే వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీచేయలేదు. గత ప్రభుత్వంలో వైసిపి ప్రభుత్వానికి అంటకాగి టిడిపిని ఇబ్బంది పెట్టిన వారిలో కొంత మంది యథాతథంగా కొనసాగారు. బదిలీపై నిషేధం అమలులోకి వచ్చినా పాత తేదీలతో బదిలీల ఉత్తర్వులు ఇవ్వాలని ఇప్పటికీ జిల్లా పరిషత్‌లో పైరవీలు కొనసాగుతున్నాయి. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ బదిలీల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రణాళిక విభాగంలో కొంత మందిని బదిలీ చేసినా వారు రిలీవ్‌ కాకుండా గడువు ముగిసినా కొనసాగుతున్నారు. (ఎ.వి.డి.శర్మ)

➡️