రాజకీయ ప్రచారం చేస్తున్న వాలంటీర్లను తొలగించాలి

Mar 20,2024 15:14 #ongle district
  • సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వలంరెడ్డి లక్ష్మణ రెడ్డి

ప్రజాశక్తి-ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వచ్ఛంగా జరగాలంటే రాజకీయ ప్రచారం చేస్తున్న, వాలంటీర్లను తొలగించాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీన ఒంగోలులోని రంగాభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డితో పాటు సుపరిపాలన వేదిక నేత రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ సుంకర సాయిబాబు, ఒంగోలు పట్టణ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు కొల్లా మధు, సుపరిపాలన వేదిక ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కంచర్ల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్‌ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె .ఆల్ఫ్రెడ్‌ , కర్నూల్‌ రోడ్డు షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ మారెళ్ళ సుబ్బారావు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లు ఎన్నికల విధులలో భాగస్వాములు కాకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్‌, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా స్థానిక అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్‌ 171, 123 ప్రకారం నేరంగా పరిగణించి అలాంటి వాలంటీర్లను తొలగించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు పిచ్చితో సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు , 104 ,108 వాహనాలు, పాస్‌ పుస్తకాలు, ప్రభుత్వ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్‌ దస్త్రాలు పాటు సర్వే రాళ్లు, చివరికి మధ్యాహ్న భోజనంలో భాగంగా అందించే చిక్కీలపైన, ప్రభుత్వ ఆసుపత్రి రిపోర్టుల పైన కూడా ముఖ్యమంత్రి ఫోటోలు ఉండడం దురదష్టకరమని వాటన్నిటిని తొలగించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. వ్యసనపరులను ,అభివృద్ధి నిరోధకులను, అవినీతిపరులను ఓడించి అభివద్దే ధ్యేయంగా సుపరిపాలనను అందించే నిజాయితీపరులైన నేతలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ 15 మంది నిజాయితీపరులైన మేధావులు, రిటైర్డ్‌ అధికారులతో ఏర్పడి ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కషి చేస్తుందన్నారు. అర్హత ఉండి ఓటర్ల జాబితాలో ఓట్లు లేని వారు ఏప్రిల్‌ 15వ తేదీ లోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకొని ఓటు పొందవచ్చునని తెలిపారు. ఓటుకు 1000 తీసుకుంటే ఐదేళ్లలో రోజుకి 54 పైసలు మాత్రమే లభిస్తాయని ఈ పరిస్థితుల్లో పవిత్రమైన ఓటు హక్కును డబ్బులు, మద్యం లాంటి ప్రలోభాలకు అమ్ముకోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లో రాబోవు ఎన్నికలు పెట్టే వ్యయము భారతదేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరిగే రాష్ట్రంగా మారిపోతుందని వివరించారు. ఎన్నికల అక్రమాలపై స్పందించడానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఏర్పాటుచేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004250264, వాట్సాప్‌ నెంబర్‌ 879000557ను వినియోగించుకోవాలని కోరారు. ఎలక్షన్‌ కమిషన్‌ రూపొందించిన సి విజిల్‌ యాప్‌ ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేధావులు మౌనం వీడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తోడ్పడాలని కోరారు. అక్షరాస్యతలో 30వ స్థానంలో ఉండడం,రాజకీయ అవినీతి ఘనంగా పెరగడం , పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గడం ,నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం లాంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌ ను అభివృద్ధి వైపు పరుగులు తీయించే అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ సుంకర సాయిబాబు ప్రసంగిస్తూ రాజకీయ పార్టీలు హింస పూరిత చర్యలకు చరమగీతం పాడాలని కోరారు. ఇటీవల గిద్దలూరులో పి.మున్నయ్య అనే వ్యక్తిని ప్రజాగలం సభకు జనాన్ని తీసుకుని వెళ్లారనే కారణంతో అధికార పార్టీ వాళ్లు దారుణంగా హత్య చేయడం దుర్మార్గమన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉండాలన్నారు. ఒంగోలు పట్టణ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు కొల్లా మధు ప్రసంగిస్తూ అభివద్దే ధ్యేయంగా సుపరిపాలన అందించే నిస్వార్ధ రాజకీయ నేతలను ఎన్నుకోవాలని కోరారు. సుపరిపాలన వేదిక ఉపాధ్యక్షులు కంచర్ల సుబ్బారావు ప్రసంగిస్తూ కులము మతము డబ్బులు మద్యము లాంటి ప్రలోభాలకు లోను కాకుండా సుపరిపాలనను అందించే నేతలను ఎన్నుకోవాలని కోరారు.

➡️