ప్రభుత్వ పాలనకు ఓటింగే నిదర్శనం

May 14,2024 21:56

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సంక్షేమ పాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్‌లో పాల్గొన్నాని వైసిపి అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తన గెలుపుకోసం ఎన్నికల్లో పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనలో లంచగొండితనం లేని విధానాన్ని గమనించి, మేనిఫెస్టోను ఆమోదించి నందువల్లే పోలింగ్‌ సరళి పెరిగిందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విజయనగరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 8 నియోజకవర్గాలను వైసిపి కైవసం చేసుకుంటుందని తెలిపారు. విజయనగరంలో తనకు, పార్లమెంట్‌ స్థానంలో బెల్లాన చంద్రశేఖర్‌కు మంచి మెజార్టీ వస్తుందని తెలిపారు. 2019 ఎన్నికలలో ఎలా విజయావకాశాలు లభించాయో, అదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించారని అన్నారు. అన్ని వ్యవస్థలను మేనేజ్‌చేసే చంద్రబాబు ఎన్నికల ఏజెంట్ల గుర్తింపు కార్డులను కూడా పసుపురంగులో వచ్చే విధంగా ఎన్నికల అధికారులను ప్రలోభాలకు గురి చేయడం సరికాదన్నారు. ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలుకు తావు ఇయ్యకుండా, ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు చేసిన కృషి ఎంతైనా అభినందనీయమని అన్నారు. సమావేశంలో పార్టీ జోనల్‌ ఇన్‌ఛార్జులు, పార్టీ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, ఆయా విభాగాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️