ప్రజాశక్తి-కడప అర్బన్ విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మనోహర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేంద్ర, వెంకటపతి కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి గ్రామ సేవకులకు వేతనాలు పెంచలేదని, వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చే వేతనం ఏ మూలకు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిన విఆర్‌ఎల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని తెలిపారు. రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ విఆర్‌ఎల కష్టాలు, సమస్యలు తీర్చేవారు లేరని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విఆర్‌ఎలకు పేస్కేలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా విఆర్‌ఎలకు పే స్కేల్ అమలు చేయాలని మంత్రులు, అధికారుల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్న కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న విఆర్‌ఎలు ఎప్పటికైనా విఆర్‌ఒ ప్రమోషన్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం మాత్రం ప్రమోషన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్‌ఎలుగా గుర్తించడం లేదని, ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వీఆర్‌ఏలకు వయోభారం పెరుగుతుందని చెప్పారు. దళిత, గిరిజన, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలకు విఆర్‌ఎల కుటుంబాలను ఆకలి బాధల నుంచి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెరిగిన ధరలకు అనుకూలంగా విఆర్‌ఎలకు పేస్కేలు అమలు చేయాలని, అటెండర్ నైట్ వాచ్‌మెన్ ప్రమోషన్ల శాతాన్ని 70 శాతంకు పెంచాలని, అక్రమ డ్యూటీలను రద్దుచేసి, అర్హులైన విఆర్‌ఎలకు అటెండర్ నైట్ వాచ్‌మెన్‌గా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, శివ, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
