ప్రజాశక్తి – వేముల డిటోనేటర్ పెట్టి పేల్చడంతో విఆర్‌ఒ మృతిచెందాడు. మండలంలోని వి.కొత్తపల్లిలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. నరసింహులు (45) విఆర్‌ఒగా పనిచేస్తున్నాడు. మృతుడు, అతని భార్య సుబ్బలక్షుమ్మ, ఇద్దరు కుమారులు, తన ఇంటిలోని కాంపౌండ్ లోపల ఆదివారం రాత్రి నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు డిటోనేటర్‌ను మంచం మీద పైకి విసిరి పేల్చారు. పేలుడు ధాటికి నరసింహులు మంచంలో నుంచి గాలిలోకి ఎగిరి పైనున్న రేకులు తగిలి కిందపడ్డాడు. ఈ సంఘటనలో పక్కనే ఏపకప అతని భార్య సుబ్బలక్షుమ్మకు కూడా తీవ్ర గాయాలయ్యారు. కాగా తల్లి, కుమారులు తటిలో తప్పించుకున్నారు. గాయపడ్డ వారిని కుటుంబ సభ్యులు హుటాహుటీగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నరసింహులు మతిచెందాడు. సుబ్బలక్షుమ్మను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ తరలించారు. విషయం తెలుసుకున్న డిఎస్‌పి మురళి నాయక్, సిఐ నాగరాజు,ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో విచారించారు. సంఘటన స్థలం నుంచి డిటోనేటర్లను పేలుడుకు ఉపయోగించే ఒక పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయాన్నే సంఘటన స్థలానికి క్లూస్ టీం, బాంబు స్కాడ్‌లను పిలిపించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తహశీల్దార్ ఇందిరా రాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రేఖ సంఘటన స్థలాన్ని పరిశీలించి డిటోనేటర్ పేలుడు ఘటనపై విచారణ చేపట్టారు. విఆర్‌ఒ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమే కారణమని భావిస్తూ పోలీసులు ఇద్దరి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. డిటోనేటర్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరి మైనింగ్ దగ్గర వాడుతున్నారు, అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు పులివెందుల డిఎస్‌పి మురళి నాయక్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.