విఆర్‌ఎల సమస్యలు, ఖాళీల భర్తీపై జెసికి వినతి

Dec 13,2024 23:56

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తాము దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపి గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో విఆర్‌ఎలు నరసరావుపేట కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ గనోరే ధనంజరుకు శుక్రవారం విన్నవించారు. ఈ సందర్భంగా సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్‌ బందగీ సాహెబ్‌ మాట్లాడుతూ నరసరావుపేట డివిజన్‌ పరిధిలో 23 అటెండర్‌ పోస్టులు,11 నైట్‌ వాచ్మెన్‌ పోస్టులు, గురజాల డివిజన్‌ పరిధిలో 21 అటెండర్‌ పోస్టులు, 7 నైట్‌ వాచ్మెన్‌ పోస్టులు ఖాళీలు ఉన్నాయని వివరించారు. వీటిని ఏళ్ల తరబడిభర్తీ చేయకపోవడం వల్ల గ్రామ రెవెన్యూ సహాయకులే ఆ పని భారం మోయాల్సి వస్తోందన్నారు. ఖాళీలు భర్తీ చేయాలని ఆర్‌డిఒలకు ఇప్పటికే విన్నవించామని చెప్పారు. ఇందుకు జెసి సానుకూలంగా స్పందించారు. అధికారులు ఉత్తర్వులిస్తామని హామీనిచ్చారు. అనంతరం జిల్లా రెవిన్యూ అధికారి మురళిని నాయకులు కలిసి సమస్యలు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రోశయ్య, సాంబయ్య, రఫీ, కాసులు, శ్రీకాంత్‌, రవి, మునాఫ్‌, విఆర్‌ఎలు పాల్గొన్నారు.

➡️