విఆర్‌ఎలకు పేస్కేల్‌ అమలు చేయాలి

Apr 10,2025 21:29

ప్రజాశక్తి – వంగర : విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేసి, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎపి రెవెన్యూ సహాయకుల సంఘం (విఆర్‌ఎ)లు సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్‌ డి.ధర్మరాజుకు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ మండల అధ్యక్షులు వై.అప్పలస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా పే స్కేల్‌ అమలు చేస్తుందని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తారని ఆశించామన్నారు. గడిచిన తొమ్మిది నెలల్లో కనీసం తమ సమస్యల మీద చర్చించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకనే రాష్ట్రవ్యాప్తంగా విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు సిద్ధం కాబోతున్నామన్నారు. అందులో భాగంగా తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేసినట్లు ఆయన వెల్లడించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకుల సిహెచ్‌ దుర్గారావు, కె.పార్వతి, కె. ఉదరు తదితరులు పాల్గొన్నారు.

రేగిడి: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్‌ చిన్నా రావుకు గురువారం ఆ సంఘ మండల అధ్యక్ష, కార్యదర్శులు జగన్‌, పాదాలరావు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న విఆర్‌ఎల జీతభత్యాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ధరల్లో రూ.10,500 నెల జీతంతో ఎలా బతకాలని ప్రశ్నించారు. పిల్లల చదువులు, వైద్యం, కుటుంబ నిర్వహణ భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన తహశీల్దార్‌ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వీరితోపాటు సంఘం ప్రతినిధులు బాలరాజు, సత్యనారాయణ, పోలిరాజు ఉన్నారు.

సంతకవిటి: విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేయాలని కోరుతూ తహశీల్దార్‌ బి.సత్యంకి వినతి పత్రాన్ని గురువారం అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌.రాములు (శివాజీ ), కె.రామప్పయ్యా, కే.నారాయణ రావు, బి.తౌడు, కె.పాపారావు తదితరులు పాల్గొన్నారు.

➡️