ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : పట్టాదారు పాసుపుస్తకం కోసం మహిళా రైతు నుంచి రూ.2 లక్షలు డిమాండ్ చేసిన విఆర్‌ఒను ఎసిబి అధికారులు మంగళవారం పట్టుకున్నారు. గుంటూరు నగర శివారు అంకిరెడ్డిపాలేనికి చెందిన చెరుకూరి ప్రమీల ఫిర్యాదు మేరకు వీఆర్వో షేక్ హసీనాపై మంగళవారం ఎసిబి అధికారులు దాడి చేశారు. వెంగళాయపాలెంలో రెండు సచివాలయాలకు ఇన్‌ఛార్జి విఆర్‌వోగా హసీనా వ్యవహరిస్తున్నారు. పాస్ పుస్తకం మంజూరు చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని ప్రమీలను విఆర్‌ఒ డిమాండ్ చేశారు. ఆమె నుంచి డబ్బు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హసీనా కొంత కాలంగా ఇదే రీతిలో అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో మంగళగిరి ప్రాంతంలో రూ.5 కోట్ల విలువైన భూ వివాదంలో కూడా హసీనా భారీగా డబ్బు తీసుకున్నట్టు ఎసిబి అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రమీల ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించారని తెలిసింది.