నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు

Jun 9,2024 21:37

ప్రజాశక్తి – వీరఘట్టం : చెత్త నుండి సంపద సృష్టించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీ అభివృద్ధికి వినియోగపడుతుందని ఆశయంతో గత ప్రభుత్వం చెత్త సంపద కేంద్రాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. అధికారుల అలసత్వంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్ల అవి మూలకు చేరి నిరుపయోగంగా పడి ఉన్నాయి. మండలంలోని 34 పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చెత్త సంపద కేంద్రాలు నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడా పూర్తిస్థాయిలో చెత్త సంపద కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టలేదని స్థానికుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి.15 గ్రామాలకే పరిమితంమండల కేంద్రంతో పాటు దశమంతపురం, నడిమికెల్లా, తలవరం, పనసనందివాడ, కిమ్మి, తెట్టంగి, బిటివాడ, కత్తులకవిటి, రేగులపాడు తదితర గ్రామాల్లో చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటు చేసి వీటి నిర్వహణకు షెడ్‌ మిత్రులు, క్లాప్‌ మిత్రులు ప్రభుత్వం నియమించి వీరికి స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. వీరు గ్రామంలోని చెత్తను సేకరించి చెత్త సంపద కేంద్రానికి తరలిస్తారు.ఆదాయం పోతుందిమండలంలోని గడగమ్మ, చలివేంద్రి, నడుకూరు, చిట్టపూడివలస, యు.వెంకంపేట, కొట్టుగుమ్మడ, కుమ్మరిగుంట, ఎంవిపురం, పివిఆర్‌ పురం, కంబరవలస, ఎం.రాజపురం, చిన్నగారకాలనీ, కె.ఇచ్చాపురం తదితర గ్రామాల్లో చెత్త సంపద కేంద్రాలు నిర్మించకపోవడంతో సేకరించిన చెత్త వేరే చోటకు తరలించడంతో పంచాయతీకి రావాల్సిన ఆదాయం పోతుందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతుందన్నందుకు ఇది నిదర్శనమని చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్ధాంతరంగా నిలిచిపోయిన చెత్త సంపద కేంద్రాలు నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపిడిఒ ఎంవిబి సుబ్రహ్మణ్యం వద్ద ప్రజాశక్తి ప్రస్తవించగా పరిశీలన జరిపి నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️