ప్రజాశక్తి -మధురవాడ : వ్యర్ధాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎయిర్ అండ్ వాటర్ సంస్థ సంయుక్తంగా వ్యర్థాల నిర్వహణ-సర్క్యులర్ ఎకానమీపై నిర్వహిస్తున్న 14వ అంతర్జాతీయ సదస్సులో నిపుణులు పిలుపునిచ్చారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు గురువారం ముఖ్యఅతిథిగా హజరైన ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంతరణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య మాట్లాడుతూ, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే సర్క్యులర్ ఎకానమి విధానంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయన్నారు. విశాఖ వంటి నగరాలలో ప్లాస్టిక్, భవన నిర్మాణ వ్యర్థాలు ప్రధాన సమస్యగా మారాయన్నారు. తీర ప్రాంతాలలో సముద్ర జలాలు కలుషితం అయి మత్స్య దిగుబడులు తగ్గుతున్నట్లు మత్స్యకారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం టెక్నాలజి, ట్రాన్స్‌లేషన్, ఇన్నోవేషన్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి.కృష్ణకాంత్ మాట్లాడుతూ, నీతిఆయోగ్ జాతీయ ప్రణాళికలో సర్క్యులర్ ఎకానమి అంశానికి తాము మేధో సహకారం అందిస్తున్నామని తెలిపారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను, రుణాలను అందిస్తోందన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు మాట్లాడుతూ, అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకునే ప్రణాళికలు అవసరమన్నారు. సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ సాధన్ కె.ఘోష్, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొపెసర్ రాజా ఫణిపప్పు, ఈజిప్టు నేషనల్ రీసెర్చి సెంటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ షర్నేకమెల్ అమీన్, నాట్క్ ఫార్మా ఉపాధ్యక్షుడు పి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, కోరమాండల్ పరిశ్రమ విశాఖ అధిపతి ఎమ్.జ్ఞానసుందరం, సదస్సు కన్వీనర్ డాక్టర్ వైఎల్‌పి.తోరణి తదితరులు ప్రసంగించారు. వ్యర్థాల నిర్వహణపై పరిశోధనలు జరుపుతున్న, కృషిచేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డులను అందజేశారు. విశాఖకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఇన్‌స్వారెబ్ వ్యవస్థాపకులు డాక్టర్ భానుమతి దాస్‌కు ఈ అవార్డును అందజేశారు. డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో ఈజిప్ట్, నార్వే, జపాన్, అమెరికా దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు హజరై కీలక ఉపాన్యాసాలు చేయనున్నారు.