ప్రజాశక్తి-అనకాపల్లి
విఆర్‌ఎలకు వాచ్‌మెన్ డ్యూటీలను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు మంగళవారం అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూఏ నిబంధనలకు విరుద్ధంగా వీఆర్‌ఏలకు మండల రెవెన్యూ కార్యాలయాలు వద్ద రాత్రి డ్యూటీలు వేశారని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకులు గ్రామాల్లో రెవెన్యూకి సంబంధించిన ప్రభుత్వ పనులు నిర్వహిస్తారని, అటువంటిది ప్రభుత్వం వాచ్‌మెన్ డ్యూటీలు వేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా వీఆర్‌ఏలను ప్రమోషన్లు ఇవ్వలేదని అనేకమంది అర్హత ఉండి అటెండర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఖాళీలు వెంటనే భర్తీ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం రెవెన్యూ డివిజన్ అధికారి చిన్నికృష్ణకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.గంగాధర్ రావు, అధ్యక్షులు కె.రవికుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు, ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, వీఆర్‌ఏల యూనియన్ కార్యవర్గ సభ్యులు శాంతి, నాగేశ్వరరావు, ఎం.సంతోష్, కుమార్, సింహాచలం, పరదేశి నాయుడు రాజు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.