చందవరానికి నీటి శాపం

Jan 18,2025 00:32

ప్రజాశక్తి – నాదెండ్ల: నిండు కుండలా చెరువు… దానిపక్కనే నిలువెత్తు నీళ్ల ట్యాంకు… అయినా పైపులైన్ల ద్వారా నీరు సరఫరా కావడం లేదు.. నీటి పన్ను కడుతున్నా డబ్బా నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి.. తాగడానికే కాదు.. వాడుకోవడానికి, పశువుల అవసరాలు తీర్చడానికి సైతం డబ్బులను నీళ్లలా ఖర్చు చేయకుంటే అవసరం గడవని శాపానికి చందవరం గ్రామస్తులు గురయ్యారు.నాదెండ్ల మండలంలోని చందవరం గ్రామంలో 20 రోజుల నుండి పంచాయతీ వారు నీరు సరఫరా చేయడం లేదు. ఎందుకని ఇన్‌ఛార్జి కార్యదర్శిని అడిగితే… నీటిని విడుదల చేయాల్సిన వర్కర్‌కు రెండు నెలలుగా జీతం ఇవ్వకపోవడ వల్ల అతను పని చేయడం లేదని, దీనిపై సర్పంచ్‌ను తాను సంప్రదించగా తెలీదంటున్నారని చెబుతున్నారు. ఏతావాతా నీటి సరఫరా నిలిచి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గ్రామంలో సుమారు 2200 కుటుంబాల వరకు ఉండగా జనాభా 3800-4 వేల మధ్య ఉంటుంది. గ్రామ నీటి అవసరాలు తీర్చడానికి సుమారు పదెకరాల్లో చెరువు, దాని పక్కనే 10 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగిన ఓవర్‌ హెడ్‌ట్యాంకు ఉంది. గతంలో ప్రతిరోజూ ఉదయం పూట పైపులైన్ల ద్వారా నీరు సరఫరా చేసేవారు. అయితే 20 రోజుల నుండి పైప్‌లైన్ల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు బోరు నీరు ఆధారంగా రోజులు గడపాల్సి వచ్చింది. గ్రామంలో వీధి బోర్లు 15 వరకు ఉండగా సగం కుటుంబాలకు సొంతంగా బోర్లున్నాయి. అయితే అన్నింటి నుండి వచ్చేది ఉప్పునీరే కావడంతో వీటిపి పరిమిత అవసరాలకే స్థానికులు ఉపయోగించుకోగలుగుతున్నారు. తాగునీటి కోసం, వంట చేసుకోవడానికి అవసరమైన నీటి కోసం స్థానికులు ప్రైవేటు వాటర్‌ ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. స్నానం, బట్టలు ఉతకడం తదితర ఇతర అవసరాలకు బోరునీరే ఆధారమైంది. పశువులకు సైతం వాటర్‌ ప్లాంట్ల నీరు తెచ్చుకోక తప్పడం లేదు. దీంతో ఒక్కో క్యానును రూ.6 వరకు వెచ్చించి కొనాల్సి వస్తోంది. 2020లో వైసిపి హయాంలో గ్రామంలో రూ.90 లక్షలతో వాటర్‌ ప్లాంట్‌ను నిర్మించినా రెండు మూడు నెలలకే మరమ్మతులకు గురై మూలన పడింది. దీంతో గ్రామంలోని రెండు ప్రైవేటు వాటర్‌ ప్లాంట్‌లు, సమీప గ్రామమైన సాతులూరులోని వాటర్‌b ా్లంట్లకు చందవరం గ్రామస్తులు నీరు కోసం బారులు తీస్తున్నారు. సొంత బోర్లు లేనివారు ఇంటి, వంటి అవసరాల కోసం వాడుకోవడానికి నీటి కోసం కటకటలాడుతున్నారు. మొత్తంగా గ్రామమంతా నీటి ఇక్కట్లతో సతమతమవుతోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుల్‌ బిల్లుల భారంతో కుటుంబాలు గడవడమే కష్టంగా ఉంటే రోజు ఐదారు నీళ్ల క్యాన్లను కొనాల్సి రావడంపై ఆగ్రహానికి గురవుతున్నారు. పశువులకు నీరు పెట్టడానికి ఎంత నీరు కొనాలని ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో వైసికికి చెందిన వారు సర్పంచ్‌ కావడం, గత ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావడంతో రాజకీయ విభేదాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు స్థానికులు భావిస్తున్నారు. రాజకీయ వివాదాలు ప్రజలకు శాపం కాకుండా చూడాలని, నీటి సరఫరాకు సత్వరం చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

➡️