సాగునీటి కోసం మూడ్రోజుల కిందట క్రోసూరు మండలంలో ఆందోళన చేస్తున్న రైతులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లాలో పంటలకు నీటి ఎద్దడి మరింత పెరిగింది. 90 రోజులుగా వర్షాలు లేకపోవడం వల్ల నీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. నాగార్జున సాగర్ కాల్వలకు అరకొరగానే నీటి విడుదల కొనసాగుతోంది. అంతేగాక వారాబందీ వల్ల నీటి విడుదల వల్ల చేతికి అందివచ్చే దశలో ఉన్న పంటలకు నీరు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నాగార్జున సాగర్‌లో గరిష్టనీటి నిల్వ 312 టిఎంసీలు కాగా ప్రస్తుతం 148.55 టిఎంసీల నిల్వ ఉంది. సాగర్‌లో గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 519.60 అడుగుల వద్ద ఉంది. గత 20 రోజుల్లో నీటి నిల్వలు దాదాపు 20 టిఎంసీలు తగ్గాయి. కుడి, ఎడమ కాల్వలకు కలిపి ప్రస్తుతం నిత్యం 16 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో మిర్చి, అపరాల పంటలు కోతలకు సిద్దంగా ఉన్నాయి. మిర్చికి చివరి తడి అవసరం అని రైతులు చెబుతున్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల పంటలు బెట్టకొస్తున్నాయి. ప్రధానంగా రబీలో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, కంది తదితర పంటలకు నీటి అవసరం ఎక్కువగా ఉంది. పల్నాడు జిల్లాలో 1.20 ఎకరాలల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. జిల్లాలో 48 వేల ఎకరాల్లో వరి, మరో 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 7 వేల ఎకరాల్లో కంది, పొగాకు 12 వేలు ఎకరాలు, మినుము 5 వేల ఎకరాలు, ఇతర పంటలు 32 వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో మిర్చి, శనగ, మొక్క.జొన్న, జొన్న, వరి, కందితో పాటు వివిధ పంటలకు నీటి అవసరం ఏర్పడింది. సాగర్ ఆయకట్టు పరిధిలో పెదకూరపాడు, గురజాల, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేటతో పాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంటలకు నీటి అవసరం పెరిగింది. కనీసం 10 రోజుల పాటు నీటి విడుదల పరిమాణాన్ని పెంచాలని రైతులు కోరుతున్నారు. గత నెల రోజులుగా ఎండ తీవ్రత పెరుగటం వల్ల చివరి భూముల్లో పైర్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజులుగా రైతు సంఘాలు వివిధ స్థాయిలో నీటి ఎద్దడిపై ఆందోళన చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో సాగునీటి ఎద్దడిపై గురువారం అసెంబ్లీలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. వారాబందీ వల్ల సమస్యలు పెరిగాయని, ఏప్రిల్ చివరి వరకు పంటలకు సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా పరిధిలోని తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో రబీ పంటలకు నీటి అవసరం పెరిగింది. ప్రధానంగా మేడికొండూరు, తాడికొండ, కాకుమాను, పెదనందిపాడు, పెదకాకాని మండలాల్లో జొన్న, మొక్కజొన్న, శనగ పైర్లకు నీరు అవసరమని రైతులు చెబుతున్నారు.
