ప్రజా సంఘాల నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడుతున్న కెఎస్ లక్ష్మణరావు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రజా సమస్యలను నిశితంగా పరిశీలించి, పరిష్కారంపై స్పష్టమైన అవగాహన, నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్లే పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని ప్రజా సంఘాలు ఏకతాటిపైకి రావాలని ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రులు నియోకవర్గం ఎమ్మెల్సీ పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా, ఉద్యమ సంఘాలు బలపరిచిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణానికి శుక్రవారం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 27న పోలింగ్ ఉంటుందని, తాను 10వ తేదీన (సోమవారం) నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. గుంటూరులో నామినేషన్ దాఖలుకు పట్టభద్రులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. 2007లో శాసన మండలి పునరుద్ధరణ అనంతరం 14 మంది ఎమ్మెల్సీలం గెలుపొందామని, పిడిఎఫ్‌గా ఏర్పడి అనేక సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందజేసి పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. 18 ఏళ్లుగా ప్రజా, కార్మిక, కర్షక, ఉద్యోగుల పక్షాన నిలిచి నిబద్ధతగా, నీతి-నిజాయితీతో, రాజ్యాంగ విలువలకు కట్టుబడి పని చేశామని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికులు, కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, రైతులు కోసం, సాగు, తాగు నీటి సమస్యల పరిష్కారానికి మండలిలో గళం విప్పామని, అనేక ఉద్యమాలకు మద్దతు తెలపడంతోపాటు ప్రత్యక్షంగానూ పాల్గొన్నామని తెలిపారు. పల్నాడు జిల్లాలో వరికపూడిశెల ఆవశ్యకతను, విద్యారంగం బలోపేతానికి ప్రతిపాదనలపై మండలిలో మాట్లాడామన్నారు. ప్రజలకు అనేక ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో ఏమీ చేయని కారణంగా పజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. 12వ వేతన సంఘం వేస్తారని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించి బకాయి ఉన్న రూ.22 వేల కోట్లలో కొంతైనా చెల్లిస్తారని ఆశపడినా భంగపడ్డారన్నారు. సిఎం చంద్రబాబు తొలి సంతకం డిఎస్‌సిపై చేసి 16,347 పోస్టులు భర్తీ చేస్తామని నవంబర్ 6 లోగా డిఎస్‌సి ప్రకటిస్తామని హామీ ఇంకా అమలు చేయలేదన్నారు. జీవో 117ను రద్దు చేస్తామని చెబుతూనే కొనసాగిస్తున్నారని, ప్రత్యామ్నాయంగా ఇంకొన్ని ప్రతిపాదనలు చేయగా అవి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు. ఆయా సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రశ్నించే పిడిఎఫ్ అభ్యర్థులను మండలికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గద్దె చలమయ్య, ముజఫర్ అహ్మద్, కట్టా కోటేశ్వరరావు, డి.శివకుమారి, ఎస్.ఆంజనేయులు నాయక్, సిలార్ మసూద్ పాల్గొన్నారు.
