ప్రజాశక్తి-సీతమ్మధార : పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని పోర్టు డాక్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ స్పష్టంచేశారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోర్టు హాస్పిటల్ వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మంగళవారం నాటికి 127వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలనుద్దేశించి కె.సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రైవేటీకరణ నిర్ణయం అనైతికమన్నారు. హాస్పిటల్ టెండర్‌కు వచ్చిన వారిని అడ్డుకొని, తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, సుమారు 40 వేల మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేట్ వారికి అప్పగించడం తగదన్నారు. పోర్టు యాజమాన్యం వద్ద రిజర్వ్ ఫండ్, వేల ఎకరాల భూమి ఉన్నప్పటికీ, ప్రైవేటీకరణ నిర్ణయం అన్యాయమని, దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి.రామలింగేశ్వరరావు, కెఎస్.కుమార్, బి.రాజగోపాల్, సిహెచ్‌విఎస్.రెడ్డి, జిసిహెచ్‌వై.నాయుడు, బి.జగన్, రాఘవులు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
