తేమశాతం 25 ఉన్నా ధాన్యం కొంటాం

Nov 28,2024 00:32

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సమస్యలు వివరిస్తున్న ఎం.హరిబాబు తదితరులు
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ :
ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో రైతుల ఇబ్బందులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు కౌలురైతు సంఘం నాయకులు విన్నవించారు. మండలంలోని చిర్రావూరులో రైతులను కలవడానికి మంత్రి బుధవారం రాగా ఆయన్ను కౌలురైతు సంఘం నాయకులు కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ రైతు వద్ద ధాన్యం మొత్తాన్ని కొంటామని, కొనుగోలు చేసిన 48 గంటల్లో నగదును రైతు ఖాతాలో జమ చేస్తామనే ప్రభుత్వ ప్రకటన ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గోనె సంచులు ఉండడం లేదని, రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతాన్ని నిర్థారించి ధరను నిర్ణయించాలనేదీ అమలు కావడం లేన్నారు. ప్రతి గ్రామంలో కాటా వేసి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని మిల్లుకు తరలించడం లేదని, పరిమితి ప్రకారం 5,6 వాహనాలు మాత్రమే మిల్లుల వద్దకు వెళుతున్నాయని, దీంతో రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపైన, పొలాల్లో ఉంచాల్సి వస్తోందని వివరించారు. నిల్వ ఉన్న ధాన్యాన్ని తేమ శాతం సడలించి కొనుగోలు చేయాలని, లోడింగ్‌ కాటాకు కూలి బస్తాకు రూ.25 పెంచాలని కోరారు. రైతులు ధాన్యం నూర్చిన వెంటనే మార్కెట్‌కు, మిల్లుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కేరళ, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో మాదిరి ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ధరకు రూ.500 బోనస్‌ ప్రకటించాలన్నారు. రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు ప్రతి గ్రామంలోనూ స్థలాలను సేకరించి, అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 25 శాతం వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, నగదును 24 గంటల్లోనే జమ చేస్తామని చెప్పారు. ప్రైవేట్‌ వ్యాపారులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొంటే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. చిర్రావూరులోని ధాన్యాన్ని సాయంత్రం లోగా కాటా వేసి లోడింగ్‌ చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు పి.కృష్ణ, పి.సుబ్బారావు, బి.గోపాలరావు, పి.శివనాగేశ్వరరావు, ఎ.శ్రీనివాస్‌ ఉన్నారు.

➡️