భూములిచ్చి కూలీలయ్యాం.. ఉపాధి కోసం ఎదురు చూస్తున్నాం..

Jan 22,2025 00:20

సభలో మాట్లాడుతున్న తహశీల్దార్‌ కుటుంబరావు
ప్రజాశక్తి – దాచేపల్లి :
తామిచ్చిన భూముల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేయనందున సాగు చేసుకుంటామని అధికారుల ద్వారా సమాచారం పంపినా మై హోమ్‌ సిమెంట్స్‌ నుండి స్పందన లేకపోవడం అంటే తమను కించపరచడమేనని గ్రామ సభలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశమై మండంలంలోని గ్రామాలపాడులో బాధిత రైతులు, కంపెనీ ప్రతినిధులతో అధికారులు మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. బాధిత రైతులతోపాటు రెవెన్యూ, పోలీసు అధికారులు హాజరైనా ఫ్యాక్టరీ ప్రతినిధులు మాత్రం హాజరవలేదు. భూముల విషయంలో గతనెల 17న కలెక్టర్‌కు, ఈనెల 3న తహశీల్దార్‌కు రైతులు విన్నవించగా ఈనెల 21న మైహోం ప్రతినిధులతో చర్చలకు అధికారులు నిర్ణయించారు. కంపెనీ నుండి ఎవరూ రాకపోవడం గమనార్హం.ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ఫ్యాక్టరీ పేరుతో 900 ఎకరాలను కారుచవగ్గా 20 ఏళ్ల కిందటే (2004) తీసుకున్నారని గుర్తు చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానికులకు ఉద్యోగాలొచ్చి గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించామని, భూములను కోల్పోయిన తాము కూలీలుగా మారినా పిల్లల్ని బాగా చదివించి అవకాశాల కోసం నిరీక్షిస్తున్నామని, ఇప్పుడు వారి వయసూ మీరిపోతోందని చెప్పారు. ఆ భూమే తమ వద్ద ఉంటే తమతోపాటు ఒక్కోరైతు 10 మంది కూలీలకు పని కల్పించేవాడని అన్నారు. ఇప్పుడు తమ పొలాలు అడవులను తలపిస్తున్నాయని, అందులోని జంతువులు ఇతర పొలాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. తమ భూముల్లోని పంట కాల్వలను, బోర్లనూ మైహోం యాజమాన్యం ధ్వంసం చేయించిందని మండిపడ్డారు. ఫ్యాక్టరీ కోసం గామాలపాడు, ఇరికేపల్లి గ్రామాల్లోని పొలాలిచ్చిన అనేక మంది రైతులు నేడు అప్పుల పాలయ్యారని, తమ పొలాలను తాము సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని, ఫ్యాక్టరీ పెట్టాక పొలాలను ఖాళీ చేస్తామని అన్నారు. ఇదిలా ఉండగా ఇతర రైతుల భూములు సైతం ఆన్‌లైన్‌లో మైహోం సిమెంటు పేరుతో నమోదయ్యాయని, రెవెన్యూ అధికారులకు విన్నవించినా పరిష్కరించకుండా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మొత్తం 24 అంశాలతో కూడిన డిమాండ్లను అధికారులకు వినతిపత్రంగా రైతులిచ్చారు. తహశీల్దార్‌ కుటుంబరావు మాట్లాడుతూ కంపెనీ ప్రతినిధులకు తాము ఫోన్‌ చేసినా స్పందించలేదని, రైతుల సమస్యలను ఆర్‌డిఒ ద్వారా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇతర చర్యలు తీసుకుంటామన్నారు. సభలో ఎస్సై సౌందర్య రాజన్‌, ఆర్‌ఐ కుమార్‌, వీఆర్వో నాగేశ్వరరావు, బాధిత రైతులు బొమ్మ కోటేశ్వరరావు, సుధీర్‌, రోళ్ల శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, జానీ, వెంకట్‌ నర్సయ్య, నరసింహారావు, వాళ్ల నవజ్యోతిరెడ్డి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తు….న్నాఎస్‌.వెంకటరామయ్య
ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎకరం పొలాన్ని రూ.50 వేలకు తీసుకున్నారు. అప్పటి నుండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ గ్రామంలోనే చిన్నచిన్న పనులు చేసుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నా.
మా భూములూ ఫ్యాక్టరీ పేరుతోనే….. ఆర్‌.శ్రీనివాసరావు
గామాలపాడులో మైహోం సిమెంట్స్‌ తీసుకున్న భూములను ఆనుకుని ఉన్న మా పొలాలు కూడా ఆన్‌లైన్‌ అండంగల్‌ 1బిలో ఆ ఫ్యాక్టరీ పేరుతో మార్చారు. రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ ఏడాదిగా తిప్పించుకుంటున్నారు.

➡️