కబ్జాలపై ఎవరినీ ఉపేక్షించం

Feb 4,2025 18:54 #savitha

ప్రజాశక్తి – కడప : జిల్లాలో జరిగిన భూ కబ్జాలపై విచారణ చేపడుతున్నామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. రాబోయే వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, రైతులకు ఆర్థికసహాయం పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.  కలెక్టరేట్ లో మంగళవారం జరిగిన డీఆర్సీ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. సమావేశంలో జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి పనులపైనా, పలు సమస్యలపైన చర్చించామన్నారు. శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతిపైన సమీక్షించామన్నారు. ముఖ్యంగా రాబోయే వేసవి దృష్ట్యా కడపలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ సొంత నియోజక వర్గం పులివెందుల పట్టణంలో తీవ్ర తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. ఎన్డీయే పాలనలో పులివెందుల వాసులకు తాగునీటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామన్నారు. ఇప్పటికే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఇసుక అందజేస్తున్నామని తెలిపారు. జగన్ రెడ్డి చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామన్నారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ పనిచేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామన్నారు. దీనిలో భాగంగా 26 జిల్లాల్లోనూ ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించామన్నారు. దేశంలో ఏరాష్ట్రంలోనూ లేనివిధంగా పెన్షన్లను రూ.4 వేలు అందజేస్తున్నామన్నారు.

త్వరలో 3 సూపర్ సిక్స్ పథకాలు..
త్వరంలో మూడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సహాయం పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కాబోతున్నాయన్నారు. ప్రధాని నరేంద్రమోడి ఆశీర్వాదంతో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరొచ్చిందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. రాష్ట్రమంతా రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇలా రాష్ట్రమంతటా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.

కబ్జారాయుళ్లను ఉపేక్షించం
జిల్లాలో వేల ఎకరాల్లో భూములు అన్యాక్రాంతయ్యాయని, కబ్జాలపై విచారణ సాగుతోందని, ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. గత ప్రభుత్వ హయాం కడపలో కబ్జాలకు అంతేలేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములను కబ్జాలు చేశారన్నారు. తమ ప్రభుత్వం కబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రమంతంటా రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. ఈ సదస్సుల్లో వచ్చిన వినతులకు పరిష్కారాలు సైతం చూపుతున్నామన్నారు. కడప జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు 12,425 వినతులు రాగా, వాటిలో 3,884 దరఖాస్తులకు పరిష్కారాలు చూపామన్నారు. మిగిలిన అర్జీలకు త్వరలో పరిష్కారాలు చూపుతామని మంత్రి సవిత తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

➡️