డెంగీ నివారణలో భాగస్వాములు కావాలి

May 16,2024 20:37

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : డెంగీ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.విజయపార్వతి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు పిలుపు నిచ్చారు. ఈ మేరకు వైద్య సిబ్బందితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ డెంగీ దినోత్సవం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఎడిస్‌ దోమల ద్వారా డెంగీ వ్యాధి వ్యాప్తి చెందుతుందని హఠాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరంతో మొదలవుతుందని, ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై రాష్‌, వాంతి వికారం, రక్తస్రావం మొదలగు లక్షణాలుంటాయన్నారు. త్వరగా గుర్తించడం ద్వారా డెంగీ వ్యాధి తీవ్రత కాకుండా జాగ్రత్త పడవచ్చని, నివారణ సులభ మార్గమని ప్రజల్లో అవగాహన పెంపొందిం చాలని అన్నారు. సమర్ధవంతంగా ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాలు చేపట్టడం, దోమల లార్వా వృద్ధి చెందే స్థావరాలను గుర్తించి తొలగించడం, నీటి తొట్టెలపై మూతలు ఉంచడం, దోమతెరలు వినియోగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో, క్షేత్ర స్థాయిలో డెంగీ నిర్ధారణ పరీక్షలు అందుబాటు లో ఉన్నాయన్నారు. సమాజ భాగస్వామ్యంతో డెంగీ వ్యాధి నివారణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారా యణ, ఎపిడిమియాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్‌ నగేష్‌ రెడ్డి, డెమో యోగీశ్వర రెడ్డి, నాగేంద్ర, హెల్త్‌ సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.జియ్యమ్మవలస : ప్రపంచ డెంగీ దినోత్సవం సందర్భంగా జియ్యమ్మవలస, రావాడరామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రల్లో, చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలోనూ వైద్యాధికారి జగదీష్‌, అనిల్‌ కుమార్‌, డాక్టర్‌ శంకర్రావు ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రజలు దోమతెరలను ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కురుపాం : డెంగీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రావాడ రామభద్రపురం పిహెచ్‌సి వైద్యాధికారి చీకటి శంకరావు అన్నారు. జాతీయ డెంగీ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని గురువారం కురుపాం సంతలో డెంగీ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సీతానగరం : స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నుంచి బజారు వరకు జాతీయ డెంగీ దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలు జాగ్రత్తలపై వైద్యాధికారులు సూచించారు. అలాగే పెదంకలాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ఎం.రాధా కాంత్‌, నిహారిక, సూపర్వైజర్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.వీరఘట్టం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగీ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ,ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా పలు అంశాలపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి ప్రదీప్‌, సూపర్వైజర్‌ జనార్దన్‌ రావు, ఎం ఎల్‌ హెచ్‌ పీ లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️