ప్రజాశక్తి-కొత్తపట్నం : కొత్తపట్నం మండలం సర్వసభ్య సమావేశం శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి మంచినీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జల జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని, వాటర్ ట్యాంకుల నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు నీరందించాలని తెలిపారు. మండలంలోని పాఠశాలలో నాడు నేడు పనుల ద్వారా ప్రారంభించిన తరగతి గదుల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యా శాఖకు సూచనలు చేశారు. మండలంలో అసైన్మెంట్, డికెలు, గ్రామ కంఠాలు భూములు ఉన్నాయని, వీటిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి అన్ని పనులు చురుకుగా పని చేయాలని అన్నా రు. సచివాలయం సిబ్బంది ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకొని పని చేయాలని సూచించారు. మండలం మొత్తం సర్వే చేయించారని, సర్వేలో వచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు అందరూ సహకరించాలని కోరారు. మండలంలోని కొత్తపట్నం బీచ్ హార్బర్ 390 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఎయిర్‌పోర్టు కూడా వస్తుందని తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు పెన్షన్ల కోసం అప్లై చేసుకునే వాళ్లు తీసుకోవచ్చని తెలియజేశారు. గత ప్రభుత్వం అనేకమంది అనర్హులకు పెన్షన్ ఇచ్చిందని, వాటిని సర్వే చేయించి అర్హులైన వారికి మాత్రమే పెన్షన్ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఏడు పంచాయతీలలో ఏడు కోట్ల యాభై లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. తహశీల్దారు కార్యాలయం నుంచి బీచ్ వరకు సెంటర్ డివైడర్‌తో డబుల్ రోడ్డు నిర్మాణం, లైటింగ్ చేస్తామని తెలియజేశారు. బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి పూర్తి చేస్తామని, అలాగే మోటుమాల నుంచి రోడ్డు గుండమాల వరకు నిర్మాణం రోడ్డు నిర్మాణం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, తహశీల్దార్ పిన్నిక మధుసూదనరావు, ఎంపీడీవో శ్రీకృష్ణ, జడ్పిటిసి సైకం లక్ష్మీ శారద, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.