పోలీస్‌ శాఖ ‘మీతో – మేము’ కార్యక్రమం ప్రారంభం

Nov 30,2024 00:39

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన, జాగ్రత్తలు తెలిపేలా ‘మీతో – మేము’ అనే వినూత్న కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నచిన్న సమస్యలకు భయపడి, క్షణికావేశంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇది ఎంత మాత్రమూ సరికాదని అన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లో డిజిటల్‌ బోర్డులు పెట్టి ప్రజలకు చట్టాల అవగాహన కల్పించడం హర్షణీయమన్నారు. గంజాయి, ఇతర వ్యసనాలకు అలవాటుపడి నేరాలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎస్పీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు నేరాల బారిన పడకుండా ఉండేందుకు ‘మీతో మేము -మీ రక్షణ – మా బాధ్యత’ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. అన్ని పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌ల వద్ద డిజిటల్‌ డిస్‌ప్లే స్క్రీన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు అవగాహన, సమాచారాన్ని అందించడం, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సేవలను పెంపొందేందుకు సహాయపడుతుందని తెలిపారు. ఈ డిజిటల్‌ స్క్రీన్లు శాటిలైట్‌ సిస్టంతో అనుసంధానంగా పని చేస్తాయన్నారు. ఈ సిస్టం ద్వారా ఉపయోగకరమైన సమాచారం, వీడియోలు,చిత్రాలు ప్రసారం అవుతాయని చెప్పారు. సైబర్‌ నేరాల పట్ల అవగాహన, ఫోన్‌కు ఏదైనా లింకులు వచ్చినప్పుడు వాటిని ఓపెన్‌ చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గంజాయి, డ్రగ్స్‌ బారిన పడకుండా మసులుకోవాల్సిన పద్ధతులు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పడే శిక్షలు, రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన తదితర అంశాలపై వీడియోలను రూపొందించినట్లు వివరించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్‌ సిబ్బంది కోసం ప్రత్యేకంగా 3 ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జెవి.సంతోష్‌ (అడ్మిన్‌), నరసరావుపేట డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, జగదీష్‌, వెంకట రమణ పాల్గొన్నారు.

➡️