ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జమిలి ఎన్నికల పేరుతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్ అన్నారు. నరసరావుపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నిత్యావసర సరుకులు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం కష్టంగా మారిందని అన్నారు. ఉచిత ఇసుక విధానం అమలులో సమస్యలను పరిష్కరించి అందుబాటులోకి తేవాలన్నారు. ఇప్పకే ఇసుక దొరక్క భవన నిర్మాణ, అనుబంధ రంగాలు, వాటిపై ఆధారపడ్డ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు ప్రజలపై భారాలు మోపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎసీ, ఎస్టీ, మైనార్టీలు, వెనకబడిన వర్గాల మహిళలపై అత్యాచారాలు, హింస పెరిగాయని, వీటిని అరికట్టడంతో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడ్డారు. గిరిజనులకు రిజర్వేషన్లు, ఉపాధిని దెబ్బతీసే జీవో 3ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పెరిగిన ధరల్యకు వ్యతిరేకంగా, ఇతర ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 8 నుండి 15 తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహింస్తామని చెప్పారు. ప్రభుత్వాల విధానాలను సిపిఎం శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ఎండగడతారని అన్నారు. డిసెంబర్ 1న పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో సిపిఎం జిల్లా మహాసభ నిర్వహిస్తామని, అన్ని, విజయవంతానికి అన్ని రంగాల ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు సహకరించాలని కోరారు.