ప్రజాశక్తి-రాజంపేట అర్బన్/ఒంటిమిట్ట రాష్ట్ర వ్యాప్తంగా గోతులు పడిన రహదారులకు మరమ్మతులు చేపట్టి గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన రాజంపేట, ఒంటిమిట్ట పరిధిలో గుంతల రోడ్లను పరిశీలించారు. తొలుత రాజంపేట ఆర్అండ్బి అతిథి గృహంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లెలో పాట్‌హోల్ ఫ్రీ ఎపి కార్యక్రమం (గుంతల రహిత రోడ్ల)లో భాగంగా ఆర్అండ్బి అధికారులతో కలిసి మంత్రి రోడ్ల మరమ్మతు పనులను పర్యవేక్షించారు. అనంతరం రూ.4.9 లక్షలతో మల్లకాటిపల్లి నుండి బెస్తవారిపల్లి వరకు 11 కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారుల మరమ్మతుల పనులను ప్యాచ్ వర్క్ పనుల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి నాటికల్లా గుంతల రహిత రహదారులే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా రహదారుల మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో రహదారులన్నీ గుంతలమయంగా మారడంతో, ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర రహదారుల మరమ్మతుల పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.860 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రోడ్లు, భవనాల, పరిశ్రమల, పర్యాటక శాఖలను, వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేశారని వాటిని గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు అందరూ నష్టపోయారన్నారు. పిపిపి మోడల్లో రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల అభివద్ధి కోసం రూ.3 వేల కోట్లు వెచ్చించనున్నామని తెలిపారు. భారత్ మాల కార్యక్రమంలో భాగంగా రూ.28 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా మొత్తంగా దాదాపుగా రాష్ట్రంలో రహదారులన్నింటికీ రూ.70 వేల కోట్లతో మరమ్మతులు, అభివద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. మొదటగా వద్ధాప్య పెన్షన్లను రూ.4000కి పెంచి ఒకటో తేదీన ఇంటింటికి పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి మొదటి విడతగా మంజూరు చేయడం జరిగిందన్నారు. దశలవారీగా ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలందరికీ అందివ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొదటి దశలో 110 పనులకు గాను జిల్లాకు రూ.15.97 కోట్లు నియోజకవర్గాల వారిగా మంజూరు చేశామన్నారు. 657.635 కిలోమీటర్లు మేర రహదారుల్లో గుంతలను పూడ్చడం జరుగుతుందని తెలిపారు ఇప్పటివరకు 15 శాతం పనులు పూర్తి అయ్యాయని డిసెంబర్ చివరినాటికి పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. రెండో దశలో 169 పనులకు గాను రూ.22.08 కోట్లు మంజూరు చేశామన్నారు. 830.47 కిలోమీటర్ల మేర రహదారులకు ఏర్పడిన గుంతలను పూరుస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచామని తెలిపారు. వచ్చే సంక్రాంతి లోపల పూర్తి చేసి గుంతల రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ వైఖోమ్ నదియాదేవి, కడప ఆర్అండ్బి ఇఇలు నాగేశ్వరరెడ్డి, మాధవి, ఇన్‌ఛార్జి ఆర్‌డిఒ వెంకటపతి, డిఇ షేక్ షావలి, ఎఇ గంగిరెడ్డి, ఒంటిమిట్ట తహశీల్దార్ రమణమ్మ, టిడిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్రాజు, ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల అధ్యక్షులు నరసింహారెడ్డి, మోహన్‌రెడ్డి, కల్లుగీత కార్మిక మాజీ డైరెక్టర్ వెంకట నరసయ్య పాల్గొన్నారు.