ప్రజాశక్తి-రాయచోటి టౌన్ బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని బీడీ, సిగార్ కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ జి.ఓబులు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని కొత్తపల్లి, బిరాన్ సాహెబ్, వీధి, కొలిమివీధి, ముస్తఫా మజీద్, మహబూబ్ నగర్‌లోని బీడీ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల సంక్షేమ సెస్, ఫండ్ చట్టం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. మరో వైపు బీడీ కార్మికులకు ఉపయోగమైన సంక్షేమపతకాలు కొనసాగుతాయని పార్లమెంట్ మత్రిత్వ శాఖ పేర్కొన్నదన్నారు. కానీ బీడీ యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించిన వేతనాలు చెల్లించకపోగా ఇఎస్‌ఐ, పిఎఫ్ చెల్లించడం లేదన్నారు. గతంలో బీడీ యాజమాన్యల నుండి ప్రభుత్వం వసూలు చేసి 1 శాతం సంక్షేమానికి ఖర్చు చేసేదని ఇప్పుడు 27 శాతం జిఎస్‌టి పేరుతో యాజమాన్యాల నుండి గుంజుతున్నప్పటికీ ఒక్క రూపాయ కూడా సంక్షేమానికి ఖర్చు చేయలేదని తెలిపారు. అందుకే బీడీ కార్మికులకు సంక్షేమపథకాలు బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు గుర్తింపు కార్డులు వారి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్య సంబంధమైన డిస్పెన్షరీలలో వైద్య సౌకర్యాలతో పాటు పక్కా గహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోద్య బీమా వర్తింపు చేయాలన్నారు. కేరళలో లాగా 1000 బీడీలు చుడితే రూ.500లు కూలి ఇవ్వాలని కోరారు. అసిస్టెంట్ లేబర్ కమిషన్ జోక్యం చేసుకుని బీడీ కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని లేని పక్షాన లేబర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, జిల్లా బీడీ కార్మిక సంఘం స్థానిక బాద్యులు డి.భాగ్యలక్ష్మి, సిఐటియు నాయకులు మాధవయ్య, బీడీ కార్మికులు నసీమా, తస్లీమ్, కదిరున్నిసా, అయేషా, రజియా బేగం, నసీబ్ జాన్, హజీరా, ముంతాజ్ పాల్గొన్నారు.